Mobile Popup Ad
Mobile Popup Ad

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రోడ్డెక్కి రైతుల నిరసన

కలం, యాదగిరిగుట్ట : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాదగిరిగుట్ట (Yadagirigutta) మండలం మల్లాపురం గ్రామంలో సోమవారం రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం వద్దే ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కర్రె వెంకటయ్య మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు పండించిన ప్రతి గింజను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసేవారని, నేడు ఆ పరిస్థితి లేదని గుర్తు చేశారు.

అధికార పార్టీ నాయకులు కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చి కేవలం ఫొటోలకు ఫోజులివ్వడానికే పరిమితమయ్యారని, క్షేత్రస్థాయిలో రైతులకు ఒరిగింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న కక్ష పూరిత నిర్ణయాల వల్ల రైతులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారని, వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాపట్ల నరహరి, చల్లూరి స్వామి, గౌడ శ్రీశైలం కురుమ, మాజీ మదర్ డైరీ డైరెక్టర్ ఒగ్గు బిక్షపతితో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే ధాన్యం సేకరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

Read Also: ‘నేపాలీలతో జాగ్రత్త!’.. హైదరాబాద్ పోలీసుల వార్నింగ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>