కలం, స్పోర్ట్స్: ఆసియా గేమ్స్ (Asian Games) మహిళల రోడ్ రేస్‌లో ఆఫ్ఘానిస్థాన్‌కు చెందిన 23 ఏళ్ల సైక్లిస్ట్ ఫరీబా హషిమీ (Fariba Hashimi) రజత పతకం గెలుచుకుని కొత్త చరిత్ర సృష్టించారు. జపాన్‌లోని నాగోయా సమీపంలో మంగళవారం జరిగిన ఈ పోటీలో ఆమె రెండో స్థానంలో నిలిచారు. అడ్డంకులను దాటుకుని సాధించిన ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనదని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఫరీబా హషిమీ ఆఫ్ఘానిస్థాన్‌లో తన సోదరి యుల్దుజ్‌తో కలిసి సైక్లింగ్ ప్రారంభించారు. మహిళలపై ఆంక్షలు ఉన్న ఆ వాతావరణంలో, ఆమె తన గుర్తింపును దాచిపెట్టి పురుషుడి వేషంలో శిక్షణ తీసుకునేవారు.
ఆ సమయంలో స్థానికుల నుంచి రాళ్ల దాడులు ఎదురైనా ఆమె తన లక్ష్యాన్ని వీడలేదు. 2021లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ మహిళల విద్య, క్రీడలు, స్వేచ్ఛపై తీవ్ర ఆంక్షలు విధించారు. ఆ పరిస్థితుల్లో ఇటలీ మాజీ ప్రపంచ ఛాంపియన్ అలెసాండ్రా కాపెల్లోటో సహాయంతో ఫరీబా దేశం విడిచి ఇటలీకి చేరుకున్నారు. అక్కడ నివాసముంటూ తీవ్రంగా శ్రమించి, రెండేళ్ల క్రితం ప్యారిస్ ఒలింపిక్స్‌లో కూడా పాల్గొన్నారు.
ఈ విజయం తన ఒక్కదానిదే కాదని, కలలు కనే కోట్లాది మంది మహిళల పోరాటానికి గుర్తు అని ఫరీబా పేర్కొన్నారు. భయపడకుండా వచ్చే తరం ముందుకు రావాలనేదే తన ఆకాంక్ష అని చెప్పారు. ప్రస్తుతం ఈ పతకంతో గుర్తింపు పొందిన ఆమె, 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌పై దృష్టి సారించారు.

