కలం, వరంగల్: వరంగల్ (Warangal) నగరాన్ని భిక్షాటన రహితంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న (GWMC Commissioner Venkanna) అధికారులను ఆదేశించారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి, కేవలం తరలించడంతో సరిపెట్టకుండా వారికి పునరావాసం, వైద్య సేవలు, కౌన్సెలింగ్, నైపుణ్యాభివృద్ధి, ప్రత్యామ్నాయ జీవనోపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.
హనుమకొండ పరిధిలోని భీమారంలో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, జీడబ్ల్యూఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెల్త్‌కేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ పునరావాస కేంద్రాన్ని కమిషనర్ వెంకన్న మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వారికి అందుతున్న వసతి, భోజనం, వైద్య సేవలు, పరిశుభ్రత తదితర సౌకర్యాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లు, లబ్ధిదారుల వివరాలను పరిశీలించారు.
కేంద్ర ప్రభుత్వ SMILE కార్యక్రమంలో భాగంగా భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి అవసరమైన సహాయం అందిస్తూ పునరావాసం కల్పించాలని వెంకన్న తెలిపారు. బల్దియా, పోలీసు శాఖ, మెప్మా, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి భిక్షాటన చేస్తున్న వారి వివరాలను నమోదు చేయడంతో పాటు అర్హులకు పునరావాసం కల్పించాలని సూచించారు. కేంద్రంలో మౌలిక వసతులు, సేవల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో అదనపు కమిషనర్ జోనా, మెప్మా పీడీ రాజేశ్వర్‌రావు, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, డీఎంసీ రజితారాణి, టీఎంసీలు రమేష్, వెంకట్‌రెడ్డి, హెల్త్‌కేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అంజలి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

