epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం

కలం, వెబ్ డెస్క్: తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాల్కన్ ఎండీ అమర్ దీప్‌ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫాల్కన్ స్కామ్ (Falcon Scam) కేసులో కీలక పురోగతి లభించిందని పోలీసులు చెబుతున్నారు. ఫాల్కన్ ఎండీ అమర్ దీప్ కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడ్డ విషయం తెలిసిందే. విదేశాల్లో ఉన్న అమర్ దీప్ మీద ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు తిరిగివచ్చిన వెంబడే ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇచ్చిన సమాచారంతో అమర్ దీప్‌ను అరెస్ట్ చేశారు.

ఫాల్కన్ ఎండీ మీద ఉన్న ఆరోపణలు ఇవే..

ఫాల్కన్ ఎండీ డిజిటల్ పెట్టుబడుల పేరిట ప్రజలను మభ్యపెట్టి భారీ మొత్తంలో డబ్బులు కొల్లగొట్టినట్లు అమర్‌దీప్‌పై ఆరోపణలు ఉన్నాయి. యాప్‌ ఆధారిత డిపాజిట్లు, అంతర్జాతీయ కంపెనీల్లో పెట్టుబడులు, షేర్ మార్కెట్‌లో తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పి వేలాదిమందిని మోసం చేసినట్టు అభియోగాలు ఉన్నాయి. సుమారు రూ.850 కోట్ల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. పెట్టుబడులు పెట్టిన వారికి తొలుత కొంత లాభం చెల్లించి నమ్మకం పెంచిన అనంతరం నగదును మళ్లించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫాల్కన్ స్కామ్ (Falcon Scam) బయటపడిన వెంటనే అమర్‌దీప్ విదేశాలకు పారిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. తన భార్యతో కలిసి చార్టెడ్ విమానంలో దుబాయ్‌కు వెళ్లిన అతడు అక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అమర్‌దీప్‌పై లుక్‌అవుట్ సర్క్యులర్ జారీ చేసి, అతడి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు, అంతర్జాతీయ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు.

ఇప్పటికే పలువురి అరెస్టులు

ఈ కేసులో ఇప్పటికే ఫాల్కన్ కంపెనీ సీఈఓతో పాటు అమర్‌దీప్ సోదరుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రధాన నిందితుడైన అమర్‌దీప్‌ను అదుపులోకి తీసుకోవడంతో కేసు దర్యాప్తు కీలక దశకు చేరిందని పోలీసులు తెలిపారు. స్కామ్‌కు సంబంధించిన నిధుల లావాదేవీలు, విదేశాలకు తరలించిన డబ్బు వివరాలు, ఈ మోసంలో భాగస్వాములైన ఇతరుల పాత్రపై లోతైన విచారణ జరపనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అమర్‌దీప్ అరెస్ట్‌తో ఫాల్కన్ స్కామ్ వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్ బయటపడే అవకాశముందని, బాధితుల నుంచి సేకరించిన డబ్బు రికవరీపై కూడా దృష్టి సారిస్తామని తెలంగాణ పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>