కలం, వెబ్ డెస్క్ : మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని దంతేపల్లి శివారులో చిరుత పులి సంచారం (Leopard Sighting) తీవ్ర కలకలం రేపుతోంది. దంతేపల్లి సమీపంలోని కాకుల గుట్ట ప్రాంతంలో కామారెడ్డి – రామాయంపేట ప్రధాన రహదారి రోడ్డును చిరుత దాటుతుండడాన్ని అటుగా వెళ్లిన వాహనదారులు, స్థానికులు ప్రత్యక్షంగా గమనించారు. రహదారిపై చిరుత కనిపించడంతో వాహనదారులు భయాందోళనకు గురై వాహనాలను నిలిపివేశారు.
గుట్టలు, దట్టమైన అటవీ ప్రాంతం సమీపంలో ఉండటంతో చిరుత ఆహారం లేదా నీటి వేటలో భాగంగా రహదారిపైకి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. స్థానికులు వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు అందించారు. ఈ నేపథ్యంలో దంతేపల్లి, పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో, వేకువజామున కామారెడ్డి-రామాయంపేట మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు, రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

