వడ్డించిన విస్తరిలా ఇస్తే విచ్ఛిన్నం చేశారు.. మంత్రి పువ్వాడ ధ్వజం

కలం, ఖమ్మం బ్యూరో: గతంలో కేసీఆర్ నాయకత్వంలో 19,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని పెంచి, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లను అద్భుతంగా నిర్మించి ‘వడ్డించిన విస్తరి’లా కాంగ్రెస్‌కు అప్పగిస్తే.. మూడేళ్లలోనే విద్యుత్ వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేశారు” అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో మళ్లీ పాతరోజుల ‘కరెంట్ కోతలు’ పునరావృతమవుతున్నాయని, ప్రజలు, రైతులు తీవ్ర విద్యుత్ కష్టాలు ఎదుర్కొంటున్నారని ధ్వజమెత్తారు. ​

ప్లాంట్ బయటే బీఆర్ఎస్ నిరసన..

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపు మేరకు, విద్యుత్ ప్లాంట్ల క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావులతో కూడిన బీఆర్‌ఎస్ బృందం గురువారం మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ (Bhadradri Thermal Plant)ను సందర్శించింది. అయితే ప్లాంట్ లోపలికి తమను అనుమతించకుండా అధికారులు ఆంక్షలు విధించడంపై బిఆర్‌ఎస్ నాయకులు అక్కడే తీవ్ర నిరసన తెలిపారు.

8 గంటల కరెంటే..

అనంతరం ప్లాంట్ ప్రాంగణం వెలుపల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) మాట్లాడారు. కేసీఆర్ హయాంలో రైతాంగానికి, గృహ వినియోగదారులకు, పారిశ్రామిక అవసరాలకు 24 గంటల పాటు ఉచిత, నాణ్యమైన విద్యుత్‌ను అందించామని ఈ సందర్భంగా పువ్వాడ గుర్తుచేశారు. కానీ నేడు కాంగ్రెస్ సర్కార్ రైతాంగానికి కేవలం 8 గంటల కరెంట్ మాత్రమే, అదీ విడతల వారీగా ఇస్తోందని మండిపడ్డారు.

ఆ ఎనిమిది గంటల సమయంలోనే రైతులందరూ ఒకేసారి మోటార్లు ఆన్ చేస్తుండటంతో సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లపై తీవ్ర భారం పడి పేలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లో-వోల్టేజ్ సమస్యతో మోటార్లు కాలిపోతున్నాయని, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను మార్చుకోవడానికి రైతులు మళ్లీ తమ సొంత డబ్బులు వేసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

బకాయిలు విడుదల చేయాలి..

​అలాగే రాష్ట్రంలోని థర్మల్ పవర్ ప్లాంట్లకు నాణ్యమైన బొగ్గు సరఫరా కావాలంటే సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. నిధులు చెల్లించకపోవడం, ప్రభుత్వ నిర్వహణా లోపాల వల్లే విద్యుత్ ఉత్పాదన పూర్తిగా దెబ్బతింటోందని విమర్శించారు.ప్రస్తుతం సింగరేణిలో ప్రతిరోజూ ఒక స్కామ్, కోల్ కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

భద్రాద్రి ప్లాంట్‌లోని మొత్తం 4 యూనిట్లలో 2 యూనిట్లు పనిచేయడం లేదని స్వయంగా అధికారులే ఒప్పుకుంటున్నారని పువ్వాడ అన్నారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రత్యక్ష నిదర్శనమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒకవైపు హైడల్ పవర్ ప్లాంట్లలో నీళ్లు లేక, మరోవైపు థర్మల్ ప్లాంట్లకు నాణ్యమైన బొగ్గు సరఫరా లేక తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు. ​వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి రైతాంగానికి, గృహాలకు, పరిశ్రమలకు నాణ్యమైన 24 గంటల విద్యుత్‌ను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.

అలాగే సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీలను వెంటనే విడుదల చేసి పవర్ ప్లాంట్లకు పూర్తి స్థాయిలో నాణ్యమైన బొగ్గు అందేలా చూడాలని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. లో-వోల్టేజ్ సమస్యల కారణంగా కాలిపోయిన రైతు ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లకు ప్రభుత్వమే తక్షణమే ఉచితంగా రిపేర్లు చేయడమో లేదా కొత్తవి మార్చి ఇవ్వడమో చేసి దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాలని  డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>