కలం, ఖమ్మం బ్యూరో: మతం, ఆధ్యాత్మికత ముసుగులో అమాయక గిరిజన ప్రజలను నమ్మించి, ఆపై వారి అత్యాశను ఆసరాగా చేసుకుని ఒక పూజారి లక్షలాది రూపాయలతో చెక్కేసిన ఉదంతం ఖమ్మం (Khammam) జిల్లా కామేపల్లి మండలంలో కలకలం రేపుతోంది. రూ. లక్షకే తులం ముడి బంగారం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి, బాధితుల నుండి భారీగా నగదు వసూలు చేసి సదరు పూజారి పరారయ్యాడు. బాధితులు ఇప్పుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
మోసం జరిగిందిలా..
ఏపీలోని నంద్యాలకు చెందిన దివ్యాంగుడు బోగా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి, కేరళ శబరిమల ఆలయ 136వ తాంత్రిక పూజారినంటూ ఏడు నెలల క్రితం కామేపల్లి మండలంలోని కెప్టెన్ బంజార గ్రామానికి వచ్చాడు. ఖమ్మం నగరంలో ఒక అద్దె గదిలో నివాసముంటూ, ప్రతిరోజూ గ్రామానికి వస్తూ పోతూ ఉండేవాడు. గ్రామంలో అట్టహాసంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలను పొందాడు. గ్రామంలో ప్రజలకు ఆర్థిక సాయం కూడా చేస్తూ నమ్మకం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలోనే కెప్టెన్ బంజార గ్రామాన్ని తానే దత్తత తీసుకున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సమీప గ్రామాల్లోని అయ్యప్ప మాలదారులతో సైతం మంచి ఆధ్యాత్మిక సంబంధాలను ఏర్పరచుకున్నాడు.
పక్కా స్కెచ్‌తో మోసం
అందరితోనూ సత్సంబంధాలు నెరుపుతూ, తనపై ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పక్కా వ్యూహంతో వ్యవహరించాడు. ప్రజల్లో తనపై పూర్తి నమ్మకం ఏర్పడిందని గ్రహించిన తర్వాత సదరు నకిలీ పూజారి తన అసలు రంగు బయటపెట్టాడు. తనకు బిస్కెట్ బంగారం వ్యాపారులతో పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నాయని, మార్కెట్ ధర కంటే చాలా తక్కువగా రూ. లక్షకే తులం ముడి బంగారం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ప్రస్తుత మార్కెట్ ధరతో పోలిస్తే సగం ధరకే బంగారం వస్తుండటంతో, స్థానికులు కొందరు అత్యాశకు పోయి, మరికొందరు సదరు పూజారిని బతిమిలాడి లక్షలాది రూపాయల నగదును ఆయన చేతిలో పెట్టారు. కెప్టెన్ బంజర, బాసిత్ నగర్, కామేపల్లితో పాటు జిల్లాలోని ఇతర గ్రామాలకు చెందిన పదుల సంఖ్యలో బాధితులు ఈ మాయలో పడి మోసపోయినట్లు తెలుస్తోంది.
పూజారి పరార్
వారం క్రితం పూజారి లక్ష్మీనారాయణ ఖమ్మంలోని తన అద్దె గదిని ఖాళీ చేసి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. బాధితులు అతడికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆయనతోపాటు నిరంతరం తిరుగుతూ, బాసిత్ నగర్‌కు చెందిన యువకుడు సాయి కుమార్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో బాధితులకు అనుమానం వచ్చింది. తాము మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన బాధితులు కామేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆశపడి మోసపోయాను
లక్షకు తులం బంగారం అని చెప్పగానే ఆశ పడ్డాను. మిరప పంట అమ్మి, బంధువుల దగ్గర అప్పు చేసి మొత్తం రూ.11 లక్షలు ముట్టచెప్పాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు.పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను.
– బానోతు అఖిల్, కామేపల్లి
50 లక్షల దాకా మోసం
కొంత మంది బాదితులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.ప్రాథమిక అంచనా ప్రకారం నిందితుడు సుమారు రూ. 50 లక్షల వరకు మోసం చేసినట్లు తెలుస్తోంది. ఇంకా కొంత మంది బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి బయపడుతున్నారు.
– ప్రవీణ్, కామేపల్లి ఎస్సై

