కలం, కరీంనగర్ బ్యూరో: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ (Vemulawada) రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. వీటీఏడీఏ (వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ) ఆధ్వర్యంలో రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్రం, బద్ది పోచమ్మ ఆలయం అభివృద్ధి పనులు, ప్రధాన రోడ్డు విస్తరణ పనులను బుధవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై ఆర్అండ్‌బీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగంగా పూర్తి చేయడంపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలి
రాజన్న ప్రధాన ఆలయ విస్తరణ, ఇతర ప్రతి అభివృద్ధి పనులకు సంబంధించి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. పనుల్లో వేగం పెంచాలని, అవసరమైన పనివారి సంఖ్య మరింత పెంచాలని ఆదేశించారు. రాజన్న ఆలయం నుంచి మూల వాగు బ్రిడ్జి వరకు కొనసాగుతున్న ప్రధాన రోడ్డు విస్తరణ పనులను జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ పరిశీలించారు.
మున్సిపల్ అధికారుల పనితీరుపై ఆరా!
పనులు పూర్తి చేయడంపై మున్సిపల్ అధికారులను ఆరా తీశారు. పనులు వేగంగా పూర్తి చేసి.. వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. రాజన్న, బద్ది పోచమ్మ ఆలయాల విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదానం సత్రం నిర్మాణ పనులు, రోడ్డు విస్తరణ పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో గడువు తేదీ ఇవ్వాలని ఆయా శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. సమావేశంలో ఆర్అండ్‌బీ ఈఈ నరసింహాచారి, వేములవాడ ఆర్డీవో కేఎస్ బీ కుమారి, ఆలయ డిప్యూటీ ఈఓ భాస్కర్ శర్మ, ఆర్ అండ్ బీ డీఈ శాంతయ్య, వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేష్, తహసీల్దార్ జయంత్, టీపీఓ అన్సార్ తదితరులు పాల్గొన్నారు.

