‘గోల్డ్ మ్యాన్’ గుట్టురట్టు.. ఐటీ విచారణలో షాకింగ్ నిజాలు

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో భారీ బంగారు ఆభరణాలతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన “గోల్డ్ మ్యాన్” (Fake Gold Man) అసలు రూపం బయటపడింది. ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఇంతకాలం అతడు బంగారం అని చెబుతున్న నగలన్నీ అసలు బంగారం కాదని.. గిల్ట్ గోల్డ్ అని తేలింది. అత్తాపూర్‌కు చెందిన 34 ఏళ్ల సూర్య భాయ్ అలియాస్ పల్లపు సురేష్ కుమార్‌ ఒంటి నిండా భారీ నగలతో కనిపిస్తూ ఉంటాడు. దీంతో అతడికి గోల్డ్ మ్యాన్ గా పేరొచ్చింది. యూట్యూబ్ చానళ్లు, కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు సైతం అతడిని ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టాయి. దీంతో సూర్య భాయ్‌కి (Surya Bhai) విపరీతమైన క్రేజ్ వచ్చింది. సెలబ్రిటీ హోదా అనుభవించాడు.

ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో 1.4 కిలోల బంగారంతో పట్టుబడ్డ కొండా విజయ్ కుమార్ కేసు విచారణలో భాగంగా సూర్య భాయ్ గురించి సమాచారం అందడంతో అధికారులు విచారణకు పిలిచారు. విచారణకు హాజరైన సూర్య భాయ్ సుమారు రూ.1 కోటి విలువైనట్లు కనిపించే 12 రకాల ఆభరణాలతో వచ్చాడు. అయితే అధికారుల ప్రశ్నలకు తడబడటంతో అనుమానం వ్యక్తమై, వాల్యూయర్లతో పరీక్షించగా ఆ నగలు కేవలం రూ.3 లక్షల విలువైనవని తేలింది. వాటిలో మెజారిటీ రాగిపై రోడియం కోటింగ్, మరికొన్ని వెండిపై గోల్డ్ కోటింగ్ ఉన్నట్లు వెల్లడైంది. మొత్తం 32 సెట్ల నగలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

గత ఆరు సంవత్సరాల్లో 2022-23 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే రూ.4.9 లక్షల ఆదాయాన్ని చూపించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు తెలిసింది. జిమ్ ఇన్స్ట్రక్టర్‌గా, చికెన్ షాప్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. తన పేరు మీద గానీ, భార్య పేరు మీద గానీ ఎటువంటి స్థిరాస్తులు లేవని, నెలకు రూ.20 వేల అద్దె ఫ్లాట్‌లో నివసిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. అలాగే ఆయన వాడుతున్న థార్, సఫారీ, ఎండీవర్ వంటి వాహనాలు కేవలం ప్రదర్శన కోసమేనని, భూ వివాదాల సెటిల్మెంట్ల ద్వారా వచ్చే కమీషన్లతో వాటిని వినియోగిస్తున్నట్లు విచారణలో తేలింది.

SNS ప్రజా సేవా ఫౌండేషన్ పేరుతో ట్రస్ట్ నడుపుతున్నానని చెప్పినప్పటికీ, దానికి ఎటువంటి అధికారిక రిజిస్ట్రేషన్ లేదని అధికారులు గుర్తించారు. కేవలం సినిమాల్లో అవకాశాల కోసం “గోల్డ్ మ్యాన్”గా పబ్లిసిటీ కోసం ఇలా ప్రవర్తించానని సూర్య భాయ్ ఒప్పుకున్నాడు. ఇప్పటికే ‘ఘటికుడు’ వంటి రెండు సినిమాల్లో చిన్న పాత్రలు పోషించినట్లు వెల్లడించాడు. విచారణ అనంతరం సూర్య భాయ్‌ను అధికారులు వదిలిపెట్టగా, కొండా విజయ్ కుమార్‌కు సంబంధించిన ప్రధాన కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

Read Also: బరువు తగ్గడానికి కార్డియో వేస్ట్.. బెస్ట్ దారి ఇదే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>