Mobile Popup Ad
Mobile Popup Ad

ఐఏఎస్ అధికారిగా ఫోజు.. లోన్ల పేరుతో ఘరానా మోసాలు!

కలం, ఖమ్మం బ్యూరో: ఐఏఎస్ అధికారినని పరిచయం చేసుకొని సామాన్యులు, ప్రజా ప్రతినిధులను సైతం బురిడీ కొట్టించిన ఓ ఘరానా మోసగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామానికి చెందిన తోట బాలాజీ నాయుడు ప్రస్తుతం గుంటూరు జిల్లా తెనాలి తాలూకా జండా చెట్టు బజార్‌‌లో నివసాం ఉంటున్నాడు. గతంలో ఎన్టీపీసీ రామగుండంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. ఆ సమయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ, సీబీఐ అధికారులకు దొరికిపోవడంతో అతడిని ఉద్యోగం నుండి తొలగించారు. అప్పటి నుండి సులభంగా డబ్బు సంపాదించేందుకు మోసాల బాట పట్టాడు.

టార్గెట్ వారే..

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులే లక్ష్యంగా బాలాజీ నాయుడు సరికొత్త మోసాలకు తెరలేపాడు. వారికి ఫోన్ చేసి తాను ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ సెక్రటరీనని పరిచయం చేసుకునేవాడు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన “ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన”, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన “చీఫ్ మినిస్టర్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్” కింద మీ నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరయ్యాయని నమ్మించేవాడు. నియోజకవర్గం నుండి అప్లికేషన్లు పంపాలని, ఒక్కో అభ్యర్థి చలానా కింద రూ. 2,500 కట్టాలని చెప్పి, పది మందికి కలిపి రూ. 25,000 చొప్పున తాను పంపిన క్యూఆర్ కోడ్ స్కానర్లకు డబ్బులు కొట్టించుకుని బోర్డు తిప్పేవాడు.

​బాధితుల ఫిర్యాదుతో ..

రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయ్‌నగర్ గ్రామానికి చెందిన వడ్లకుంట శివ అనే వ్యక్తికి లోన్ ఇప్పిస్తానని నమ్మబలికి లక్షలు కాజేశాడు నాయుడు. రూ. 10 లక్షల లోన్ ఇప్పించడానికి రూ. 3 లక్షలు ఖర్చవుతుందని నమ్మబలికాడు. దీంతో శివ రూ. 2,50,000 నగదును ఫోన్ పే ద్వారా బాలాజీ నాయుడు పంపిన క్యూఆర్ కోడ్‌కు బదిలీ చేశాడు. డబ్బులు తీసుకున్నాక లోన్ రాకపోగా, సదరు వ్యక్తి మోసం చేశాడని గ్రహించిన శివ రఘునాథపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ​బాధితుడి ఫిర్యాదుతో రఘునాథపాలెం పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎండీ ఉస్మాన్ షరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిందితుడి పాత నేరచరిత్ర బయటపడింది.

గతంలోనూ అనేక కేసులు

నిందితుడు బాలాజీ నాయుడుపై గతంలో 2016 లో హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు పంపగా, గత 2025 సంవత్సరంలో కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఇలాగే ఫోన్ల ద్వారా నాయకులను మోసం చేసి జైలుకు వెళ్లి వచ్చాడని విచారణలో తేలింది. నిందితుడిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులమని, ఉన్నతాధికారులమని చెప్పి పథకాలు, లోన్ల పేరుతో ఫోన్లలో డబ్బులు డిమాండ్ చేసే మోసగాళ్లను నమ్మి క్యూఆర్ కోడ్ల ద్వారా డబ్బులు పంపి మోసపోవద్దని ఈ సందర్భంగా పోలీసులు ప్రజలను హెచ్చరించారు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>