కలం, వెబ్ డెస్క్: నేటి ఆధునిక కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటం.. అదేనండి డార్క్ సర్కిల్స్ (Dark Circles). చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకు ప్రధాన కారణాలు (Dark Circles Causes).. నిద్రలేమి, గంటలు తరబడి ఫోన్ చూడటం, టీవీ చూస్తూ ఆలస్యంగా పడుకోవడం, కంప్యూటర్ వంటి డిజిటల్ స్క్రీన్ లు ఎక్కువగా చూడటం అని మనందరికి తెలుసు. అయితే డార్క్ సర్కిల్స్ రావడానికి వీటితో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అసలు ఆ కారణాలు ఏమిటి? ఎటువంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయట పడొచ్చు అనే విషయాలను వివరించారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాం.
వంశపారంపర్యం
సాధారణంగా కళ్లకింద మెలనిన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటే డార్క్ సర్కిల్స్ వస్తాయి. కొంత మందికి ఈ సమస్య వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. మీ తల్లిదండ్రులకు లేదా పూర్వీకులకు కళ్ల కింద నల్లటి వలయాలు ఉంటే అవి మీకు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. దీనిని వైద్య పరిభాషలో పెరిఆర్బిటల్ హైపర్పిగ్మెంటేషన్ అని అంటారు. సౌత్ ఏషియా, మెడిటేరియన్, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల ప్రజల జన్యువులలో సహజంగానే మెలనిన్ ఉత్పత్తి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ప్రాంతాల వారికి చిన్న వయసు నుంచే కళ్ల చుట్టూ నల్లటి వలయాలు స్పష్టంగా కనిపిస్తాయని చెబుతున్నారు.
చర్మం పలచబడటం
సాధారణంగానే శరీరంలోని అన్ని చర్మ భాగాలోకెల్లా కళ్ల కింద చర్మం చాలా పలుచగా ఉంటుంది. చర్మం పలుచబడే కొద్దీ రక్తనాళాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఈ రక్తనాళాల వల్ల నీలి, ఊదా, గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయట. వయసు పెగిరే కొద్దీ చర్మం మందం, సాగే గుణం మరింత పెరుగుతుంది. దీనివల్ల కళ్లకింద నల్లటి వలయాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయని చెబుతున్నారు నిపుణులు.
అలెర్జీలు
కళ్ల కింద నల్లటి వలయాలు రావడానికి అలెర్జీలు కూడా కారణం కావచ్చని చెబుతున్నారు నిపుణులు. పెంపుడు జంతువుల జుట్టు, పుప్పొడి, ధూళి, కాలుష్యం కారణంగా అలర్జిక్ రినైటిస్ అనే అలర్జీ వస్తుందట. ఈ కారణంగా కళ్ల చుట్టూ ఉన్న రక్తనాళాలు మూసుకుపోతాయి. దీని వల్ల కళ్లు మరింత నల్లగా కనిపిస్తాయట. వైద్యుడిని సంప్రదించి అలెర్జీకి ట్రీట్ మెంట్ తీసుకుంటే ఈ డార్క్ సర్కిల్స్ తగ్గుతాయని చెబుతున్నారు.
ఆహార లోపాలు
కళ్ల కింద నల్లటి వలయాలు రావడానికి మరొక కారణం.. పోషకాహార లోపం. శరీరంలో ఐరన్ లోపం రక్తహీనతకు దారితీస్తుంది. దీనివల్ల కణాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. ఫలితంగా చర్మం పాలిపోయినట్లు కనిపిస్తుంది. ఇది కళ్ల కింద నల్లటి వలయాలు మరింత స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. అంతేకాకుండా విటమిన్ బి12, విటమిన్ సి లోపాలు కూడా స్కిన్ టోన్ తగ్గడానికి, అలసటకు, కొల్లాజెన్ ఉత్పత్తికి కారణం అవుతాయని చెబుతున్నారు. సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చని చెబుతున్నారు.
డీహైడ్రేషన్, ఎండ ప్రభావం
కళ్లకింద నల్లటి వలయాలు ఎక్కువగా కనిపించేందుకు డీహైడ్రేషన్ కూడా కారణం అవుతుంది. డీహైడ్రేషన్ వల్ల చర్మం కాంతిహీనంగా తయారవుతుంది. అప్పుడు చర్మం పొడిబారి నల్లటి వలయాలు ఎక్కువగా కనిపిస్తాయని చెబుతున్నారు. అందుకే ప్రతిరోజూ 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. అంతే కాకుండా ఎండకు ఎక్కువగా ఉండే వారిలో కూడా డార్క్ సర్కిల్స్ సమస్య ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఎండకు వెళ్లేవారు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

