కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ(Nalgonda) జిల్లాలోని నకిరేకల్ (Nakrekal) పరిధిలో ఎక్సైజ్ పోలీసుల (Excise Police) తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. కల్తీ మద్యాన్ని అరికట్టాల్సిన అధికారులు, గీత కార్మికుల శ్రమను దోపిడీ చేస్తూ వారి దగ్గర నుంచి ఉచితంగా కల్లు తాగడమే కాకుండా, రవాణా ఖర్చులు కూడా వసూలు చేస్తున్న వైనం.. జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది.
తనిఖీ పేరుతో గీతకార్మికులకు బెదిరింపులు..
శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తనిఖీల పేరుతో గ్రామంలోని కల్లు స్థావరాలకు వెళ్లిన ఎక్సైజ్ పోలీసులు, రామ్మూర్తి అనే గీత కార్మికుడి దగ్గర నుంచి కల్లు శాంపిల్స్ సేకరించారు. నిబంధనల ప్రకారం వాటిని సీల్ చేసి ల్యాబ్‌కు పంపాల్సి ఉండగా, అక్కడే తలో సీసా కల్లు తాగి, మరో బాటిల్‌ను పార్సిల్‌గా తీసుకెళ్లారు. అంతటితో ఆగకుండా మరుసటి రోజు రామ్మూర్తికి ఫోన్ చేసి, “తనిఖీకి వచ్చిన రవాణా ఖర్చులు నువ్వే ఇవ్వాలి” అంటూ డబ్బులు డిమాండ్ చేయడం మరింత వివాదాస్పదమైంది. కష్టపడి కల్లు గీస్తున్న తనలాంటి పేద కార్మికులపై ఈ విధంగా ఒత్తిడి తేవడం అన్యాయమని రామ్మూర్తి వాపోయాడు.
లిక్కర్ మాఫియా జోలికి వెళ్లరు..
ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న లిక్కర్ మాఫియా ఆగడాలు ఈ అధికారులకు కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గల్లీ గల్లీకీ విస్తరించిన బెల్ట్ షాపుల జోలికి వెళ్లడానికి అధికారులకు ధైర్యం సరిపోవడం లేదు. కల్తీ మద్యం ఏరులై పారుతున్నా, మామూళ్ల మత్తులో ఉన్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కానీ ఎండనక వాననక తాటి చెట్లు ఎక్కి ప్రాణాలకు తెగించి కల్లు గీసే గీత కార్మికులను మాత్రం పీడించుకు తింటున్నారని స్థానికులు అంటున్నారు. ఈ ఘటన ఎక్సైజ్ శాఖ ప్రతిష్ఠకు మచ్చతెచ్చేలా ఉందని, వెంటనే ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గీత కార్మికుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పేదలపై అధికార దుర్వినియోగం ఆగాలని, చట్టం అందరికీ సమానంగా అమలవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

