కలం, నకిరేకల్: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు మంజూరు కావడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) స్పష్టం చేశారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల ఎంపీడీఓలతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి, అలాగే రెండో విడత లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన విధివిధానాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నిజమైన పేదలకు అందేలా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగాలని, ఎక్కడా అవకతవకలకు తావుండకూడదని ఆదేశించారు. ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి దశలోనూ అధికారులు అందుబాటులో ఉండి సహకరించాలని పేర్కొన్నారు.
అనంతరం రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీ రాజ్ శాఖల డిప్యూటీ ఈఈలు, అసిస్టెంట్ ఈఈలతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమీక్షించారు. నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, గ్రామీణ రహదారుల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీలు, కల్వర్టుల లాంటి మౌలిక వసతుల పనులపై సమగ్రంగా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులన్నింటినీ నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలి.
పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదని వేముల వీరేశం తెలిపారు. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా వేముల వీరేశం పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని పలువురు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: తల్లులైనా ఆట ఆగొద్దు: ఐసీసీ కొత్త రూల్స్!
Follow Us On : WhatsApp

