Mobile Popup Ad
Mobile Popup Ad

‘స్కీములు కాదు.. స్కాముల ప్రభుత్వం’ కాంగ్రెస్‌పై హరీశ్ రావు ఫైర్

కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది “స్కీముల ప్రభుత్వం కాదు.. స్కాముల ప్రభుత్వం” అని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్రస్థాయిలో విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా అశ్వారావుపేటలో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, అవగాహనా కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) తదితర నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, గత ఎన్నికలలో అబద్ధపు హామీలతో కాంగ్రెస్ గెలిచిందని, వంద రోజులలో హామీలు అమలు చేయకపోతే నిలదీయమన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు.

కేసీఆర్ హయాంలో కరోనా కష్టకాలంలో కూడా ఏ పథకానికీ గండి కొట్టకుండా రూ.73 వేల కోట్ల రైతు బంధు అందించామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం మూడు పంటలకూ రైతులకు చెల్లించాల్సిన రూ.29,358 కోట్లు బాకీ పెట్టిందని ఆరోపించారు. పంట నష్టం పరిహారం గానీ, పంట బీమా గానీ ఇవ్వలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం 70 శాతం పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం ఆగిపోయాయని, సుంకిసాల, పెద్దవాగు వంటి ప్రాజెక్టులు దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం సోలార్ (Solar) పేరుతో ఉచిత విద్యుత్‌ను తగ్గించే ప్రయత్నం చేస్తోందని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌లకు  బడ్జెట్‌లో కేటాయింపులు చేసినప్పటికీ నిధులు విడుదల చేయలేదని, గిరిజన అభివృద్ధిని కూడా విస్మరించారని ఆరోపించారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వ్యక్తిగత ఆస్తుల పెంపుపై దృష్టి పెట్టారని విమర్శించారు. పోలీసులు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధిస్తే సహించబోమని హెచ్చరించిన హరీశ్ రావు (Harish Rao), మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Read Also: రమ్మంటున్న కేటీఆర్.. రానంటున్న కేసీఆర్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>