భద్రాద్రి జిల్లాలో ఒకే రోజు రెండు విషాదాలు

కలం, దమ్మ పేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకే రోజు చోటుచేసుకున్న రెండు వేర్వేరు విషాద ఘటనలు (Bhadradri Tragedies) ఆయా కుటుంబాల్లో తీరని శోకం నింపాయి. ఒక ఘటనలో చెత్త పడేయడానికి వెళ్తున్న తండ్రి కళ్ల ముందే ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో బోల్తా పడి దుర్మరణం చెందగా.. ప్రాణాలతో బయటపడిన చిన్నారి తండ్రి మృతదేహాన్ని చూసి రోదించడం స్థానికులను కలచివేసింది. మరో ఘటనలో కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన యువకుడు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ రెండు ఘటనలకు సంబంధించి అశ్వారావుపేట పోలీసులు శనివారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

​అశ్వారావుపేట మండలం గుర్రాలచెరువు గ్రామ శివారులోని ఓ కొబ్బరి తోటలో బసబోయిన సాంబశివరావు (40) తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇంట్లోని చెత్తను పడవేసేందుకు సాంబశివరావు తన కుమారుడిని ట్రాక్టర్‌పై పక్కన కూర్చోబెట్టుకుని బయలుదేరాడు. ఈ క్రమంలో గ్రామ శివారులోని చెరువు కట్టపై ట్రాక్టర్ అదుపుతప్పి ఒక్కసారిగా చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సాంబశివరావు ట్రాక్టర్ ఇంజన్ కింద చిక్కుకుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

అయితే, ప్రమాద సమయంలో చిన్నారి పక్కకు పడిపోవడంతో ఎలాంటి గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. కళ్ల ముందే తండ్రి విగతజీవిగా మారడంతో ఆ బాలుడు రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. గ్రామస్తుల సహాయంతో సాంబశివరావును అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

​మరోవైపు, దమ్మపేట మండలం రంగువారిగూడెం గ్రామానికి చెందిన చింతల హరీష్ (32) బలవన్మరణానికి పాల్పడ్డాడు. హరీష్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ పోషణను పట్టించుకోవడం లేదని భార్య అతన్ని మందలించింది. ఈ విషయమై మనస్తాపానికి గురైన హరీష్.. అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలోని తన అక్క ఇంటికి వెళ్లాడు.

ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పని ముగించుకుని ఇంటికి వచ్చిన అక్క ఇది గమనించి వెంటనే అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే హరీష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే రోజు జరిగిన ఈ రెండు దుర్ఘటనలతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>