గోల్డ్ మెడల్‌తో చరిత్ర తిరగరాసిన ఈషా సింగ్

కలం, వెబ్ డెస్క్ : షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత యువ సంచలనం, మన హైదరాబాద్ అమ్మాయి ఈషా సింగ్ (Esha Singh) సరికొత్త చరిత్ర సృష్టించారు. జర్మనీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ (ISSF) మ్యూనిచ్ వరల్డ్ కప్‌లో బుధవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఆమె బంగారు పతకాన్ని గెలిచారు. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో అటు సీనియర్, ఇటు జూనియర్ విభాగాల్లో సరికొత్త ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టి, నిజమైన అర్థంలో ‘గోల్డ్ డబుల్ బుల్‌సాయ్’ సాధించి అంతర్జాతీయ వేదికపై భారత జెండాను ఎగురవేశారు.

21 ఏళ్ల ఈషా (Esha Singh) ఫైనల్‌లో  ప్రారంభం నుంచే అసాధారణ స్థిరత్వాన్ని కనబరిచారు. మొత్తం 43 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. దీంతో కొరియా షూటర్ కిమ్ యే-జి పేరిట ఉన్న 42 పాయింట్ల సీనియర్ ప్రపంచ రికార్డును అధిగమించారు. అదే సమయంలో, పారిస్ ఒలింపిక్ స్వర్ణ విజేత యాంగ్ జి-ఇన్ పేరిట ఉన్న 41 పాయింట్ల జూనియర్ ప్రపంచ రికార్డును కూడా తిరగరాశారు. ఈ ఫైనల్‌లో ఈషా ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. రజత పతకం సాధించిన జర్మనీ షూటర్ డోరీన్ వెన్నెకాంప్‌ కంటే ఆమె ఐదు పాయింట్లు ఎక్కువగా సాధించారు. డోరీన్ 38 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు. గత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచిన ఈషాకు, ఇప్పుడు మ్యూనిచ్ వేదికపై స్వర్ణంతో పాటు రెండు ప్రపంచ రికార్డులు రావడం మరింత ప్రత్యేకంగా నిలిచింది.

విజయం అనంతరం ఈషా మాట్లాడుతూ, “మ్యూనిచ్ వరల్డ్ కప్ చాలా ప్రతిష్టాత్మక టోర్నీ. ఇక్కడ ఫైనల్‌కు చేరుకోవడమే పెద్ద విషయం. పతకం సాధించాలని అనుకున్నా, ప్రపంచ రికార్డు సృష్టిస్తానని ఊహించలేదు” అని ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే ఆసియా గేమ్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు ఈ విజయం తనలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపిందని తెలిపారు. భవిష్యత్తులో ఇంకా మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆమె కోచ్ రోనక్ పండిట్ మాట్లాడుతూ  పిస్టల్ గ్రిప్‌లో చేసిన చిన్న మార్పు ఈషా ఆటలో భారీ మార్పుకు కారణమైందని వెల్లడించారు.

Read Also: మాగ్నస్ కార్ల్‌సన్‌కు షాక్ ఇచ్చిన ప్రజ్ఞానంద!

Read Also: పిల్లల్ని కనడం లేదు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>