కలం, వరంగల్ బ్యూరో: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు దమ్ముంటే రైతు కల్లాల వద్ద ఉత్సవాలు చేయాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) డిమాండ్ చేశారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం బీఆర్ఎస్ బృందం పర్యటించింది. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, డాక్టర్ తాటికొండ రాజయ్య, ఇతర నాయకులు రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. గన్నీ బ్యాగులు, లారీలు అందుబాటులో లేక.. కాంటాలు కాకపోగా బాధలు పడుతున్నట్లు రైతులు ఆవేదన వెలిబుచుకున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ.. మార్కెట్ లో ఏ పని చేయాలన్నా డబ్బులు వసూలు చేస్తున్నారని రైతుల ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. దమ్ముంటే కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్సవాలు చేయాలని సవాల్ విసిరారు.
మార్కెట్లలో రైతు మేళాలు నిర్వహిస్తే కాంగ్రెస్ నేతలకు రైతులే బుద్ధి చెప్తారని ఎద్దేవా చేశారు. ఈనెల 6వ తేదీకి రాహుల్ గాంధీ వరంగల్ లో రైతు డిక్లరేషన్ సభ నిర్వహించి మూడేళ్లు పూర్తయిందని, 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చారని, రైతులకు సైతం అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ మూడేళ్లలో ఒక్క పథకం అయినా అమలు చేశారా అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ కాలేదని, రుమాఫీ రూ. 38 వేల కోట్లు అని చెప్పి రూ.18 వేల కోట్లు మాత్రమే చేశారని విమర్శించారు. రైతు బంధు ఎగ్గొట్టారని, రాష్ట్రంలో ఎక్కడా మక్కలను కొనడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రైతుల సమస్యలు వినాలని, ఈ నెల 6 తారీకు లోపు పంట కొనకపోతే రైతులు కాంగ్రెస్ క్యాంపు కార్యాలయాలు ముట్టడిస్తారని హెచ్చరించారు. రైతులు కష్టపడుతుంటే రైతు ఉత్సవాలు చేసుకుంటారా? మీ డైవర్షన్ పాలిటిక్స్ అందరికీ తెలుసు అని ఆయన మండిపడ్డారు.

