కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) లో జరిగిన జ్యువెలరీ షాపు దోపిడీ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. సోమవారం కరీంనగర్‌కు వచ్చిన ఆయన, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, అనంతరం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ నగరంలో పట్టపగలు దోపిడీలు, కాల్పులు జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఘటన జరిగి 36 గంటలు గడిచినా ఇప్పటివరకు ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేదని ప్రశ్నించారు. ‘ఇంత చేతగాని ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ ఉందా?’ అని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బీహార్, యూపీ స్థాయికి దిగజారాయని వ్యాఖ్యానించారు.
సీసీ కెమెరాలు, ఆధునిక టెక్నాలజీ ఉన్నా వాటిని ఉపయోగించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. నేరాలను నియంత్రించాల్సిన పోలీసులు రాజకీయ ఒత్తిడిలో పనిచేస్తున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్ స్మార్ట్ సిటీగానే కాదు, సేఫ్ సిటీగా ఉండాలని 769 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించామని, అవే కాకుండా గంగుల కమలాకర్ నేతృత్వంలో దాదాపు 1000కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు టాప్ ప్రియారిటీ ఇచ్చి 350 కోట్లతో పోలీసులకు కొత్త వాహనాలు కొనిచ్చామనీ కానీ ప్రస్తుతం ఇంటర్ సెక్టార్ వాహనాలకు కూడా దిక్కులేదని అన్నారు. పోలీసులు ప్రజల రక్షణపై దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడకుండా మౌనం వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడటంలో విఫలమైందని, గాయపడిన వారిని పరామర్శించే కనీస బాధ్యత కూడా లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శాంతి భద్రతలను గాలికి వదిలేశారని.. ఆయన ఎంత సేపు ఎవరు ఇల్లు కూలగొడదాం, ఎవరి ఆస్తి బుల్డోజర్ పంపించి ధ్వంసం చేద్దాం అని చూస్తున్నారు తప్ప.. కన్స్ట్రక్షన్ విధానంలో ఆలోచించడం లేదని అన్నారు. ప్రభుత్వ దృష్టి కేవలం ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడంపైనే ఉందని విమర్శించారు. కరీంనగర్ ఘటనపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజలు తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, హుజురాబాద్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు.

