దమ్ముంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కొనుగోలు సెంటర్లకు వెళ్ళాలి: ఎర్రబెల్లి

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వారోత్సవాలు నిర్వహించడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దమ్ము, సిగ్గు ఉంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కొనుగోలు సెంటర్ లకు వెళ్ళాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar) సవాల్ విసిరారు. వరంగల్ లోని హంటర్ రోడ్డు వద్ద బుధవారం నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సు సభా ప్రాంగణాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతు రుణమాఫీకి రూ. 36 వేల కోట్లు అవసరం అయితే.. కేవలం రూ. 18 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసి ఈ కాంగ్రెస్ సన్నాసులు చేతులు దులుపుకున్నారంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతులు పడుతున్న గోసను తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసేందుకు బీఆర్ఎస్ తరఫున రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. కేసీఆర్ రైతుబంధును వరి నాట్ల ముందు క్రమం తప్పకుండా ఇచ్చేవారని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతీగతీ లేదని మండిపడ్డారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మొక్కజొన్న పంట కొనుగోళ్లు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే వరంగల్ మార్కెట్ కు రావాలని.. ఇక్కడ పంటల కొనుగోళ్లు జరగట్లేదని చెప్పారు. రైతు సమ్మేళనాలు కాకుండా రైతు సంక్షేమానికి పాటుపడాలని సూచించారు.

హామీలను గుర్తు చేసేందుకే ఈ సదస్సు..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరోసారి ప్రజలకు గుర్తు చేసేందుకే ఈ సదస్సు నిర్వహిస్తున్నామని మాజీ ఎంపీ వినోద్ కుమార్ (Vinod Kumar) తెలిపారు. కేసీఆర్ అమలు చేసిన ఎన్నో పథకాలను కాపీ కొడుతూ కేంద్రం ఇప్పటికే చాలా పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ఆదర్శంగా తీసుకొని మోదీ సర్కార్ పీఎం కిసాన్ పథకం అమలు చేస్తున్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. వెంటనే హామీలను అమలుచేయాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (Pochampally Srinivas Reddy) మాట్లాడుతూ.. మళ్లీ తెలంగాణలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి బీఆర్ఎస్ పోరాడుతుందని చెప్పారు. రైతు సంగ్రామ సదస్సుకు వచ్చే రైతుల అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తమ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోటీ కార్యక్రమాలను కాంగ్రెస్ నిర్వహిస్తోందన్నారు.

రేపు ఉదయం 9 గంటలకు..

ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు (Takkellapalli Ravinder Rao) మాట్లాడుతూ.. రైతు సంగ్రామ సదస్సు రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతుల పండించిన పంటలను కూడా కొనుగోలు చేయడం లేదని దుయ్యబట్టారు. పంటల సమయంలో యూరియా ఇవ్వలేదని.. పంట పండిన తర్వాత పంటలను కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. మొక్కజొన్న రైతులు నెల రోజులుగా పంట కొనుగోళ్ల కోసం కొనుగోలు కేంద్రాల (Paddy Procurement Centers) వద్ద ఎదురుచూస్తున్నారని. వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు మాట్లాడుతూ.. పోలీసులను అడ్డుపెట్టుకుని నాయకులను అరెస్ట్ చేసి రేపు నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సును అడ్డుకోవాలని కాంగ్రెస్ సర్కార్ శత ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఏది ఏమైనా ఈ సదస్సు విజయవంతంగా నిర్వహించి తీరుతామని చెప్పారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పెద్దలను తీసుకువచ్చి ఎన్నో హామీలిచ్చి రైతులను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. కేసీఆర్ రైతు పక్షపాతిఅని.. రైతులకోసం కేసీఆర్ ఎన్నో చేశారని కొనియాడారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>