కలం, వెబ్ డెస్క్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ (Emmanuel Macron) మంగళవారం ముంబై రోడ్లపై పరుగులు తీశారు. భారత పర్యటనలో భాగంగా ముంబైకి చేరుకున్న ఆయన ఈ ఉదయం 11 గంటల సమయంలో కోస్టల్ రోడ్‌పై జాగింగ్ చేశారు. ముంబైవాసులను ఆశ్చర్యంలో ముంచెత్తారు.
నేవీ బ్లూ టీషర్ట్, షార్ట్ ధరించి, సన్ గ్లాసెస్ పెట్టుకొని మేక్రాన్ హుషారుగా పరుగు తీశారు. ఆయన వెంట కొంత మంది సెక్యూరిటీ సిబ్బందితోపాటు, ఫ్రెంచ్ రాయబార కార్యాలయ అధికారులు ఉన్నారు. ఆయన వెళ్లిన మార్గంలో ప్రజలు, మీడియా వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే స్థానిక పోలీసులు ఏర్పాట్లు చేశారు. ముంబై రోడ్లపై మేక్రాన్ జాగింగ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
26/11 మృతులకు నివాళి..
అంతకుముందు మేక్రాన్ (Emmanuel Macron), తన సతీమణి బ్రిగిట్తో కలసి 26/11 మృతులకు నివాళి అర్పించారు. 2008 నవంబర్ 26న పాక్ ఉగ్రమూకలు దాడి చేయడంతో దక్షిణ ముంబైలోని తాజ్ హోటల్లో చాలా మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో చనిపోయినవాళ్లకు నివాళి అర్పించినట్లు మేక్రాన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
ప్రధానితో భేటీ
అనంతరం ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో (PM Modi) మేక్రాన్ భేటీ అయ్యారు. ఢిల్లీ నుంచి ముంబైకి చేరుకున్న ప్రధాని మోదీని లోక్‌భవన్‌లో కలిశారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక వాణిజ్య ఒప్పందంతోపాటు, రక్షణ తదితర అంశాల్లో భాగస్వామ్యంపై చర్చలు జరగనున్నాయి. కాగా, భారత్‌కు మేక్రాన్ రావడం ఇది నాలుగోసారి. ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు (AI Impact Summit) మేక్రాన్ హాజరవుతారు.
Read Also: జాతీయ రహదారుల వెంట ‘తేనెటీగ’ల కారిడార్లు
Follow Us On : WhatsApp


