ఎలక్షన్ కమిషన్ కొత్త రూల్.. తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికేట్స్ మస్ట్

కలం, తెలంగాణ బ్యూరో : కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ‘సర్’ ప్రక్రియ పార్టీలకే కాక ఓటర్లకు కూడా గుబులు పుట్టిస్తున్నది. బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరించేటప్పుడు నిబంధనల ప్రకారం కొన్ని సర్టిఫికెట్లను చూపించడం తప్పనిసరిగా మారింది. గతంలో (2002లో) చేపట్టిన ‘సర్’ ప్రకారం అప్పటి ఓటర్ల జాబితాలో పేరు ఉన్నట్లయితే ఇప్పుడు నివాసం ఉంటున్న వివరాలను సమర్పిస్తే సరిపోతుంది. కానీ అప్పటి లిస్టులో లేనట్లయితే బీఎల్వోలు అడిగే వివరాలను ఇవ్వడం తప్పనిసరిగా మారింది. ‘సర్’ (SIR) కోసం ఎలక్షన్ కమిషన్ రూపొందించిన 12 రకాల డాక్యుమెంట్లలో ఏదేని ఒకదాన్ని లేదా కొన్నింటిని రెడీ చేసి పెట్టుకోవడం ఓటర్ల బాధ్యతగా మారింది. ఈసీ నిబంధనల ప్రకారం 1987కు ముందు, 1987-2004, 2004 తర్వాత పుట్టిన వారికి వయసు ధృవీకరణ నిబంధనలు తలనొప్పి తెచ్చేలా ఉన్నాయి.

తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్లను సమర్పించాలి

ఈసీ నిబంధనల ప్రకారం 1987కు ముందు పుట్టినవారు బర్త్ డేట్‌ను ధృవీకరించే పత్రాన్ని చూపిస్తే సరిపోతుంది. 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబరు 1వ తేదీ మధ్య పుట్టినవారు మాత్రం స్వీయ బర్త్ సర్టిఫికెట్‌తో పాటు తల్లి లేదా తండ్రి బర్త్ సర్టిఫికెట్లను సైతం సమర్పించాలి. 2004 డిసెంబరు 2వ తేదీ నుంచి పుట్టినవారు మాత్రం ఓటర్ల జాబితాలో చేరాలంటే సెల్ఫ్ బర్త్ సర్టిఫికెట్‌తో పాటు తల్లి, తండ్రి (ఇద్దరివీ) బర్త్ సర్టిఫికెట్లను సమర్పించాలి. దీనికి తోడు ఈసీ పేర్కొన్న 12 రకాల డాక్యుమెంట్లలో ఒకటి లేదా కొన్నింటిని గుర్తింపు కోసం సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ 2002-2004 ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నట్లయితే ఈ గుర్తింపు కార్డులు లేదా సర్టిఫికెట్ల అవసరం లేకుండా ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటికి సంబంధించిన వివరాలను ఐడీ కార్డుల రూపంలో సమర్పిస్తే సరిపోతుంది.

ఈసీ పేర్కొన్న 12 రకాల గుర్తింపు కార్డులు

‘సర్’ ప్రక్రియ కోసం ఈసీ పేర్కొన్న గుర్తింపు కార్డులు ఇవే
• కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసిన గుర్తింపు (ఐడీ) కార్డులు
• ఐడీ కార్డు లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసినవి)
• రాష్ట్ర ప్రభుత్వం/స్థానిక సంస్థలు/బ్యాంకులు/పోస్ట్ ఆఫీస్/ఎల్ఐసీ/ప్రభుత్వరంగ సంస్థలు 1987 జూలై 1కు ముందు జారీచేసిన ఐడీ కార్డు లేదా సర్టిఫికెట్
• స్థానిక సంస్థలు లేదా ప్రభుత్వం లేదా ఆస్పత్రి జారీచేసిన బర్త్ సర్టిఫికెట్
• పాస్‌పోర్ట్
• యూనివర్శిటీ లేదా బోర్డు జారీ చేసిన మెట్రిక్యులేషన్/ఎడ్యుకేషన్ సర్టిఫికెట్
• రాష్ట్ర సంస్థ జారీచేసిన పర్మినెంట్ రెసిడెంన్స్ సర్టిఫికెట్
• అటవీ హక్కుల సర్టిఫికెట్
• సంబంధిత అధారిటీ జారీచేసిన క్యాస్ట్ సర్టిఫికెట్
• నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్నార్సీ) సర్టిఫికెట్ (వర్తించే చోటనే)
• రాష్ట్ర ప్ఱభుత్వం లేదా స్థానిక సంస్థలు జారీచేసిన ఫ్యామిలీ రిజిస్టర్ డాక్యుమెంట్
• ఆధార్ కార్డు

‘సర్’ షెడ్యూలు ఇదీ :

జూన్ 25 – జూలై 24 : ఇంటింటికీ తిరిగి బీఎల్వోల వివరాల సేకరణ
జూలై 31 : ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
జూలై 31-ఆగస్టు 30 : అభ్యంతరాల, ఫిర్యాదుల సమర్పణ
సెప్టెంబరు 28 : ఈ తేదీ లోపు అభ్యంతరాల, ఫిర్యాదులకు పరిష్కారం
అక్టోబరు 01 : ఓటర్ల తుది జాబితా విడుదల

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>