కలం, తెలంగాణ బ్యూరో: కేంద్ర వాతావరణ శాఖ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈసారి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) వారం ముందుగానే వస్తాయని పేర్కొన్నది. ఇప్పటికే అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల సమీపానికి వచ్చాయని, సాధారణ షెడ్యూలుకంటే వారం ముందే వచ్చాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొన్నది. తొలుత అంచనా వేసిన ప్రకారం ఈ నెల 24 నాటికి భారత భూభాగాన్ని తాకుతాయని, గతేడాది కంటే ఆరు రోజుల ముందే వచ్చినట్లవుతుందని పేర్కొన్నది. ఇదే అంశాన్ని హైదరాబాద్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధికారి ధర్మరాజు వివరిస్తూ, ఈ నెల 26న నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను దాటి కేరళ తీరాన్ని టచ్ చేస్తాయని తెలిపారు. కేరళ నుంచి తెలంగాణలోకి ఎంట్రీ కావడానికి దాదాపు నాలుగైదు రోజులు పడుతుందని, ఆ ప్రకారం ఈ నెల చివరికే రాష్ట్రంలో రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని వివరించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతల్లో స్వల్ప తేడా కనిపించిందని, నాలుగైదు రోజుల్లో టెంపరేచర్ మరికొంత తగ్గవచ్చని అంచనా వేశారు.
ముందస్తు వర్షాలతో రైతులకు రిలీఫ్ :
నైరుతి రుతుపవనాలు ఈసారి వారం ముందుగా వస్తున్నా వర్షాలు ఏ స్థాయిలో కురుస్తాయనేది కన్‌ఫ్యూజన్‌గా ఉన్నది. ఈసారి ‘ఎల్‌నినో’ ప్రభావం ఉంటుందని, ఆ కారణంగా సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదయ్యే అవకాశం ఉందన్నది కూడా వాతావరణ కేంద్రం భావన. కానీ ఈసారి రుతుపవనాల కదలిక వేగంగా ఉండడంతో పాటు ఉధృతంగా ఉన్నదని, అందువల్లనే అండమాన్ నుంచి కేరళకు, అక్కడి నుంచి తెలంగాణకు రావడానికి యావరేజ్ టైమ్‌తో పోలిస్తే ఈసారి స్పీడ్‌గా ఉండొచ్చని వాతావరణ అధికారి ధర్మరాజు తెలిపారు.
ఈ నెల 26న నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల మీదుగా కేరళ తీరాన్ని తాకుతాయని, అక్కడి నుంచి నాలుగైదు రోజుల్లో తెలంగాణలో ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ అధికారి ధర్మరాజు తెలిపారు. మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో 41-44 డిగ్రీలు, మిగతా జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. మాన్‌సూన్ ప్రారంభ దశలోనే చురుకుదనం కనిపిస్తున్నట్లు ఆయన వివరించారు. అంచనాలు ఎలా ఉన్నా నాలుగైదు రోజులు అటూ ఇటుగా ఉండొచ్చని ఢిల్లీలోని ఐఎండీ అధికారులు తెలిపారు. గడచిన నాలుగైదేండ్లుగా తాము అంచనా వేసినట్లే మాన్‌సూన్ వచ్చిందని గుర్తుచేశారు. గతేడాది మే 30కు భారత భూభాగాన్ని టచ్ చేస్తాయని అంచనా వేస్తే ఒక రోజు ఆలస్యంగా వచ్చాయన్నారు.
యూరియా, విత్తనాలతో రాష్ట్ర సర్కార్ అలర్ట్ :
రుతుపవనాలు ఈసారి వారం ముందుగానే వస్తాయని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి సమీక్షలో సైతం వివిధ విభాగాలను అలర్ట్ చేశారు. ఇరాన్ యుద్ధంతో యూరియాపైనా గణనీయమైన ప్రభావం పడింది. రామగుండంలోని ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో ఎల్పీజీ కొరత కారణంగా ఉత్పత్తి తగ్గిపోయింది. యూరియా నియంత్రణ మొత్తం కేంద్రం పరిధిలోని అంశం కావడంతో రైతులకు కొరత రాకుండా ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం లేఖ రాసింది. ఒకవైపు వ్యవసాయ రంగానికి చెందిన అంశాలు, మరోవైపు వర్షాలతో ఏర్పడే ఇబ్బందులు, వరదలతో జరిగే నష్టం విషయంలోనూ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగానికి సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. వాతావరణ కేంద్రం అంచనాలకు తగినట్లుగానే ప్రీ-మాన్‌సూన్ ఎఫెక్ట్ రాష్ట్రంలో కనిపిస్తున్నది. నాలుగైదు రోజుల తర్వాత చిరు జల్లులు మొదలవుతాయన్నది వాతావరణ కేంద్రం అంచనా.

