Mobile Popup Ad
Mobile Popup Ad

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

కలం, వెబ్​ డెస్క్​ : దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల (Rajya Sabha Elections) సందడి మొదలైంది. 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 37 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ నెలతో పదవీకాలం ముగియనున్న సభ్యుల స్థానాలను భర్తీ చేసేందుకు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 26న అధికారికంగా నోటిఫికేషన్ విడుదల కానుంది.

షెడ్యూల్ వివరాలు..

ఈ ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రారంభమై, మార్చి 20వ తేదీ నాటికి పూర్తి కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మార్చి 5వ తేదీగా నిర్ణయించారు. నామినేషన్ల పరిశీలన మార్చి 6న జరుగుతుంది. ఉపసంహరణకు మార్చి 9 వరకు గడువు ఉంటుంది. మార్చి 16వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎన్నికల పారదర్శకత కోసం బ్యాలెట్ పేపర్లపై ప్రాధాన్యతలను గుర్తించడానికి రిటర్నింగ్ అధికారి అందించే ప్రత్యేక వయొలెట్ కలర్ స్కెచ్ పెన్నులను మాత్రమే ఉపయోగించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలకు ఈ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుత సభ్యులు అభిషేక్ మను సింఘ్వీ, కె.ఆర్. సురేష్ రెడ్డిల పదవీకాలం ఏప్రిల్​ తో ముగియనున్నది. అలాగే రాష్ట్రాల వారీగా ఖాళీ కానున్న స్థానాల వివరాలను గమనిస్తే, మహారాష్ట్రలో అత్యధికంగా 7 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. తమిళనాడు రాష్ట్రం నుంచి 6 స్థానాలు, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల నుంచి తలో 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒడిశా రాష్ట్రంలో 4 స్థానాలు ఖాళీ కానుండగా, అస్సాం 3 స్థానాలు, హర్యానా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో రెండేసి స్థానాలు, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>