ఎల్ నినో.. అయినా తగ్గేదేలే అంటోన్న రైతులు

కలం, తెలంగాణ బ్యూరో : ఎల్​ నినో (El Nino) ఉన్నా, వర్షాలు సరిగ్గా పడవని వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్నా రైతులు మాత్రం వరి పంటనే సాగుచేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల జోలికి వెళ్లడం లేదు. వరి తప్ప తమ దగ్గర వేరే పంటలు సాగు కావని.. వేరే పంటలు వేస్తే పెట్టుబడి తడిసిమోపెడవుతుందని, దానికితోడు కోతుల బెడదతో ఆ పంటలు ఉండవని అంటున్నారు. ఇలాంటి కారణాలతోనే రాష్ట్రంలో ఎప్పటిలానే వరి వైపే అన్నదాతలు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 48.75 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేపట్టారు. సాధారణంగా ఖరీఫ్ సీజన్‌లో సాగయ్యే 45.04 లక్షల ఎకరాల విస్తీర్ణంతో పోలిస్తే ఇది మూడున్నర లక్షల ఎకరాలు ఎక్కువే.

మొత్తం సాగు 1.17 కోట్ల ఎకరాలు

రాష్ట్రంలో ఈ సీజన్‌ మొత్తానికి సుమారు 1.32 కోట్ల ఎకరాలు సాగులోకి రావాల్సి ఉండగా.. ఆగస్టు మూడో వారానికి సుమారు 1.17 కోట్ల ఎకరాల్లో సాగైంది. గతేడాది ఇదే సమయానికి 1.19 కోట్ల ఎకరాల్లో సాగైతే ఈసారి అది సుమారు 2 లక్షల ఎకరాలు మాత్రమే తగ్గింది.

వ్యవసాయ శాఖ ఖరీఫ్ సీజన్‌లో ఆగస్టు మూడో వారానికి 1.10 కోట్ల ఎకరాల్లో మాత్రమే సాగు ఉంటుందని లెక్కలేసింది. దాంతో పోలిస్తే దాదాపు 8 లక్షల ఎకరాల మేర పెరిగింది. జిల్లాలవారీగా గతేడాదితో పోలిస్తే మొత్తం సాగులోకి వచ్చిన పంటల విస్తీర్ణం 11 జిల్లాల్లో 90% టార్గెట్ చేరుకోగా.. కేవలం ఆరు జిల్లాల్లో (సూర్యాపేట, భువనగిరి, వరంగల్, మహబూబ్‌నగర్, వనపర్తి, రంగారెడ్డి) 80% లోపే సాగు నమోదైంది.

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మాత్రం సాధారణ సాగు విస్తీర్ణం కంటే ఎక్కువే ఈసారి నమోదైంది. పత్తితో పాటు జొన్న, మొక్కజొన్న, సజ్జలు, కంది, పెసలు, మినుము, మరికొన్ని పప్పుదినసుల సాగు నార్మల్‌కంటే బాగా పెరిగింది.

గతేడాదికంటే 40% వర్షపాతం తక్కువ

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్ (జూన్-సెప్టెంబర్)లో సగటున 740 మి.మీ. మేర వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు అది 430 మి.మీ. దగ్గరే ఆగిపోయింది. సాధారణ సగటుతో పోలిస్తే దాదాపు 12% తగ్గింది. గతేడాది ఆగస్టు 19 నాటికి రాష్ట్రవ్యాప్తంగా సగటున 600 మి.మీ. మేర వర్షపాతం నమోదైతే ఈసారి అది 39.6% మేర తగ్గింది. కామారెడ్డి జిల్లాలో మాత్రం మాన్‌సూన్ సీజన్‌లో సుమారు 540 మి.మీ. మేర వర్షం కురవాల్సి ఉండగా.. ఈసారి అది 22.8% పెరిగి 663 మి.మీ.కు చేరుకున్నది. మరో 17 జిల్లాల్లో సాధారణ వర్షపాతమే నమోదైంది.

ఆ జిల్లాల్లో మాత్రం వరి తక్కువే!

15 జిల్లాలు ఈసారి ఇంకా డెఫిసిట్ (లోటు వర్షపాతం)లోనే ఉన్నాయి. ఇవన్నీ యావరేజ్‌తో పోలిస్తే 20 శాతం కంటే ఎక్కువ లోటులో ఉన్నాయి. వీటిలో ఆదిలాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, ఖమ్మం, కొత్తగూడెం, మేడ్చల్, నారాయణ్​పేట్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాలు ఉన్నాయి. లోటు వర్షపాతం వల్ల కావొచ్చు.. ఈ జిల్లాల్లో చాలా చోట్ల వరి సాగు కాస్త తగ్గింది.

వరిసాగు తగ్గిన జిల్లాలు (గతేడాది, ఈ సీజన్.. లక్షల ఎకరాల్లో)

జిల్లా                        గతేడాది              ఈసారి

నల్లగొండ                  4.00                   3.56
సూర్యాపేట               3.96                    2.80
భువనగిరి                 2.45                    1.91
వనపర్తి                    1.67                    1.43
మహబూబ్‌నగర్         1.30                    1.10
కొత్తగూడెం                1.39                    0.90
మహబూబాబాద్         1.87                    1.49
సిద్దిపేట                  3.19                    2.56
సిరిసిల్ల                   1.85                    1.45
నిర్మల్                    1.24                    0.83
మంచిర్యాల             1.16                     0.98

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>