కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కుతున్నాయి. కీలక లీడర్లు ఎవరికి వారే ఎమునాతీరే అన్నట్లుగా ప్రభుత్వంపై వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో కొండా ఫ్యామిలీ ఎపిసోడ్ మరోసారి కాంగ్రెస్ కుంపటి పెట్టింది. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేయడంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎల్పీ కార్యాలయంలో భేటీ (CLP Meeting) అయి కీలక నిర్ణయం తీసుకున్నారు.
సుస్మిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ కుటుంబం వ్యవహారంపై శుక్రవారం హైదరాబాద్ లోని సీఎల్పీ కార్యాలయంలో 20 నుంచి 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో సమకాలీన రాజకీయ పరిణామాలు, పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా వివాదాలపై చర్చించారు. దీంతో పాటు కొండా సురేఖ కూతురు సుస్మిత వ్యాఖ్యల వివాదంపై తీవ్రంగా స్పందించారు.
కాగా, సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మంత్రి సురేఖకు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే, తన కూతురు చేసిన కామెంట్స్ తో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో భేటీ అయిన ఎమ్మెల్యేలు కొండా సురేఖను మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సీఎంపై మాట్లాడే వారికి పార్టీలో ఉండే అర్హత లేదు : ఎమ్మెల్యేలు
సీఎల్పీలో సమావేశం ముగిసిన అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. భేటీలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. మంత్రి కొండా సురేఖ వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా తప్పుబట్టారు. కొండా సురేఖ కూతురు సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
సుస్మిత వ్యాఖ్యలపై సురేఖ స్పందించాల్సిందేనని స్పష్టం చేశారు. వేలాది మంది కార్యకర్తలు కష్టపడి పార్టీని అధికారంలోకి తెస్తే మంత్రిగా ఉండి ఇలాంటి వ్యవహారాలను ఖండించకపోవడంపై ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రతిపక్ష నేతల్లా కానీ సొంత పార్టీ వారే మాట్లాడటం సరికాదని చురకలంటించారు. అంతర్గత విషయాలను బహిరంగంగా మాట్లాడడం సరికాదన్నారు. సీఎం గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజీనామా చేయకపోతే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని.. అలాగే, సురేఖను మంత్రి వర్గం నుంచి తొలగించాలని పార్టీ అధిష్ఠానాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు.

