కలం డెస్క్ : తెలంగాణలో ‘సర్’ ప్రక్రియ మార్చి నెల తర్వాత మొదలుకానున్నది. థర్డ్ ఫేజ్ (Third Phase) రాష్ట్రాల్లో తెలంగాణ (SIR Telangana) ఉంటుందని ఈసీ వర్గాల సమాచారం. దాదాపు 23 ఏండ్ల తర్వాత పూర్తిస్థాయిలో ఓటర్ల జాబితా రూపకల్పన జరగనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. అర్హులైన ఓటర్లను చేర్చడం, చనిపోయినవారి పేర్లను తొలగించడం, డూప్లికేట్ ఓటర్ల పేర్లను డిలీట్ చేయడం, సరైన అడ్రస్ లేని ఓటర్ల వివరాలను వెరిఫై చేయడం.. ఇలాంటివాటితో కొత్త జాబితా పర్‌ఫెక్ట్ గా ఉంటుందని పేర్కొన్నాయి. సెకండ్ ఫేజ్‌లో 12 రాష్ట్రాల్లో జరుగుతున్నందున థర్డ్ ఫేజ్‌లో తెలంగాణ ఉంటుందని సూచనప్రాయంగా తెలిపాయి. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ తదితర ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేకుండానే తెలంగాణలో ‘సర్’ ప్రక్రియ ఉంటుందని వివరించాయి.
డోర్ టు డోర్ సర్వే, వెరిఫికేషన్ :
రాష్ట్రంలో 2002లో సమగ్రమైన ఓటర్ల జాబితా రూపొందిందని ఓ సీనియర్ ఎలక్షన్ ఆఫీసర్ పేర్కొన్నారు. ఆ తర్వాత కూడికలు, తీసివేతలు మాత్రమే జరిగాయికానీ ఇంటింటి సర్వే చేయలేదన్నారు. ‘సర్’ ప్రక్రియ మొదలైతే ప్రస్తుతం ఉన్న జాబితాలోని అడ్రస్ ప్రకారం ప్రతీ ఇంటికి వెళ్ళి అందులో ఓటర్ల వివరాలను వెరిఫై చేస్తారని, అర్హులను గుర్తించడానికి ఎలక్షన్ కమిషన్ పేర్కొన్న లిస్టులోని ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో మ్యాచ్ చేస్తారని తెలిపారు. ఈ ప్రక్రియతో డూప్లికేట్ ఓటర్లు, అర్హత లేనివారి పేర్లు జాబితాలో ఉండవన్నారు. కొత్తగా ఓటర్లుగా చేరడానికి అర్హత కలిగినవారి పేర్లు చేరుతాయన్నారు. అడ్రస్ మారినవారి వివరాలు కూడా అప్‌డేట్ అవుతాయన్నారు. నకిలీ గుర్తింపు కార్డులతో ఇప్పటివరకు జాబితాలో ఉన్న ఓటర్ల పేర్లు డిలీట్ అవుతాయన్నారు.
పలు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఓటర్లు :
‘సర్’ ప్రక్రియ తర్వాత చాలా రాష్ట్రాల్లో లక్షలాది మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి డిలీట్ అయ్యాయి. అత్యధికంగా తమిళనాడులో 15.2% ఓటర్లు డిలీట్ అయ్యారు. గత ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రంలో 7.60 కోట్ల మంది ఓటర్లు ఉంటే తాజా ప్రక్రియతో 97 లక్షల పైచిలుకు ఓటర్ల పేర్లు జాబితా నుంచి డిలీట్ అయ్యాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 7.89 కోట్ల మంది ఓటర్లలో సుమారు 65 లక్షల మంది (8.24%)పేర్లు లేవు. మధ్యప్రదేశ్‌లో 5.74 కోట్ల మంది ఓటర్లలో 42.74 లక్షల మంది పేర్లు (7.5%), చత్తీస్‌గఢ్‌లో 2.12 కోట్ల మందిలో 27.34 లక్షల మంది (12.9%), కేరళలో 2.78 కోట్ల మంది ఓటర్లలో 24.08 లక్షల మంది (8.67%) పేర్లు డిలీట్ అయ్యాయి. ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లో ఆ ప్రక్రియ జరుగుతుండగా తొలి దశలో 7.61 కోట్ల మంది ఓటర్లలో 58.21 లక్షల మంది పేర్లు డిలీట్ అయ్యాయి. మొత్తం ప్రక్రియ పూర్తయ్యే నాటికి దాదాపు 1.71 కోట్ల మంది పేర్లు తొలగిపోయే అవకాశం ఉందని అంచనా.
తెలంగాణలో తగ్గే ఓటర్ల సంఖ్య ఎంత? :
వివిధ రాష్ట్రాల్లో ‘సర్’ ప్రక్రియతో లక్షలాది మంది ఓటర్లు తగ్గిపోవడంతో తెలంగాణలో ఈ సంఖ్య ఎంత ఉండొచ్చనే చర్చ ప్రాథమిక స్థాయిలోనే ఉన్నది. రాష్ట్రంలో రెండేండ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలనాటికి మొత్తం 3.26 కోట్ల మంది ఓటర్లున్నారు. మహిళలు, పురుషులు దాదాపు సమానంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసేనాటికి రాష్ట్ర జనాభా 3.57 కోట్లుగా తేలింది. అందులో 31 లక్షల మంది మినహా మిగిలినవారంతా 18 ఏండ్ల పైబడినవారేనని ఎలక్షన్ డేటా ప్రకారం స్పష్టమవుతున్నది. దాదాపు 23 సంవత్సరాల క్రితం సమగ్రంగా రూపొందిన ఓటర్ల జాబితాను ‘సర్’ ప్రక్రియ ద్వారా పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి అర్హులైనవారే ఉండేలా ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తున్నది. ఇందులో ఎంతమంది పేర్లు డిలీట్ అవుతాయో, తమిళనాడు తరహాలో దాదాపు 15% మేర డిలీషన్ ఉంటుందా?.. లేక మధ్యప్రదేశ్ తరహాలో 7.5% స్థాయిలో కనిష్టంగా ఉంటుందా?.. అనేది తేలాల్సి ఉన్నది.
Read Also: సీఎం, శ్రీధర్‌బాబుకు మధ్య కుదిరిన సయోధ్య?
Follow Us On: Pinterest


