కలం, మెదక్ బ్యూరో: ఎల్నినో ప్రభావంతో దుబ్బాక నియోజకవర్గంలోని రైతుల పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Dubbaka MLA Kotha Prabhakar Reddy) అన్నారు. చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటికే బోర్లలో నీళ్లు రాక, విద్యుత్ సరఫరా సక్రమంగా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో చేగుంట, నార్సింగి లను కరువు మండలాలుగా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే ఈ రెండు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
దుబ్బాక నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలు ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నాయని, ఈ ప్రాంత ప్రజలకు వ్యవసాయం తప్ప మరో ప్రధాన జీవనాధారం లేదని కొత్త ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రభుత్వాల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. యాసంగి పంటకు క్రాప్ హాలిడే ప్రకటించిన పరిస్థితుల్లో రైతులు, వ్యవసాయ కూలీలు ఎలా జీవించాలని ఆయన ప్రశ్నించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మెదక్ జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి చేగుంట, నార్సింగి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.

