కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా భద్రాచలం (Bhadrachalam) లో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన డ్రైవర్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ, సిరి ట్రావెల్స్ యజమాని ఇంటి ముందు మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు మృత దేహంతో ధర్నాకు దిగారు.
వివరాల్లోకి వెళితే.. భద్రాచలానికి (Bhadrachalam) చెందిన సన్నీ అనే యువకుడు ‘సిరి ట్రావెల్స్’లో చాలా కాలంగా పర్మినెంట్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కాగా, శనివారం రాత్రి మొండికుంట ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సన్నీ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
తమ ఇంట్లో సంపాదించే వ్యక్తి, తమకు దిక్కైన సన్నీ ప్రమాదంలో చనిపోతే… అతను పనిచేస్తున్న సిరి ట్రావెల్స్ యజమాని కనీసం స్పందించకపోవడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ.. ఆసుపత్రి నుంచి సన్నీ మృతదేహాన్ని నేరుగా భద్రాచలం ఐటీడీఏ (ITDA) రోడ్డులోని రూప స్కూల్ పక్కన ఉన్న సిరి ట్రావెల్స్ యజమాని ఇంటి ముందుకు తీసుకువచ్చారు.
”మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదు” అని మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతూ రోడ్డుపై బైఠాయించారు. మృతదేహంతో ఇంటి ముందు ధర్నా చేపట్టడంతో ఐటీడీఏ రోడ్డు పరిసర ప్రాంతాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సన్నీ కుటుంబానికి ట్రావెల్స్ యాజమాన్యం తగిన నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని స్థానికులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: ‘ మేం రాజీనామా చేస్తాం.. మీరు రెడీనా?’.. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్
Follow Us On: X(Twitter)

