Mobile Popup Ad
Mobile Popup Ad

విమానంలో వైన్ తాగుతున్నారా? జాగ్రత్త!

కలం, వెబ్ డెస్క్: చాలామంది విమాన ప్రయాణం చేసేటప్పుడు ప్రశాంతంగా నిద్రపోవాలని వైన్ లేదా మరేదైనా మద్యం (Drinking Wine on Flights) తాగుతారు. అయితే, ఈ అలవాటు ప్రాణాపాయానికి దారితీస్తుందని అమెరికాకు చెందిన డాక్టర్ కునాల్ సూద్ (Dr Kunal Sood) సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. విమాన ప్రయాణంలో నిద్ర కోసం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతోపాటు, గుండె వేగం అసాధారణంగా పెరుగుతుందని ఆయన తాజా అధ్యయనాలను ఉటంకిస్తూ వివరించారు. సాధారణంగా మనం పీల్చే గాలి కంటే విమానంలోని గాలిలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. ఈ తక్కువ ఆక్సిజన్ వాతావరణంలో మద్యం సేవించి నిద్రపోవడం వల్ల శరీరంలోని పరిస్థితులు మరింత దిగజారుతాయని డాక్టర్ సూద్ పేర్కొన్నారు. విమాన వాతావరణాన్ని ప్రతిబింబించేలా చేసిన ఒక ప్రయోగంలో ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి ఇది అత్యంత ప్రమాదకరమని తేలింది.

నిద్ర నాణ్యత దెబ్బతింటుంది..

మద్యం వల్ల త్వరగా నిద్ర పట్టినట్లు అనిపించినా, అది గాఢ నిద్రను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కార్నెల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ వాసిలీ ఎలియోపౌలోస్ అభిప్రాయం ప్రకారం, ఆల్కహాల్ నిద్రకు సహాయపడే సాధనం కాదు. ఇది మెదడులోని వ్యర్థాలను శుభ్రం చేసే ‘REM స్లీప్’, గాఢ నిద్రను అణచివేస్తుంది. పడుకునే ముందు రెండు పెగ్గులు తీసుకున్నా, నిద్ర నాణ్యత సుమారు 24 శాతం తగ్గిపోతుందని ఆయన వెల్లడించారు.

దీర్ఘకాలిక నష్టాలు..

సరైన నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరిగి కణాల వృద్ధాప్యం వేగవంతం అవుతుంది. నిద్రను నియంత్రించే, జ్ఞాపకశక్తిని స్టేబుల్ చేసే చర్యలకు మద్యం అడ్డుపడుతుంది. కేవలం ప్రయాణంలోనే కాకుండా, సాధారణ సమయంలో కూడా మద్యం నిద్రను ఎలా ప్రభావితం చేస్తుందో ప్రజలు తక్కువగా అంచనా వేస్తున్నారని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ప్రయాణ సమయంలో రిఫ్రెష్‌గా ఉండాలనుకునే వారు మద్యం కాకుండా ఇతర సురక్షితమైన మార్గాలను ఎంచుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Read Also: కంటి ఇన్ఫెక్షన్లకు ఇక మందులు కూడా పనిచేయవా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>