కలం వెబ్ డెస్క్ : వెనెజువెలా(Venezuela) తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్(Delcy Rodriguez)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. సరిగా పని చేయకపోతే నికోలస్ మదురో(Nicolas Maduro) కంటే కఠినంగా శిక్షిస్తానని హెచ్చరించాడు. ‘ది అట్లాంటిక్’ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా బలగాలు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను కరాకస్ నుంచి తీసుకెళ్లిన తర్వాత శనివారం మొదట ట్రంప్ రోడ్రిగెజ్‌ను పొగిడారు. కానీ, తర్వాత ఆమె తమ దేశం సహజ వనరులను కాపాడుకుంటుందని చెప్పడంతో ట్రంప్ టోన్ మార్చారు. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ గోల్ఫ్ కోర్స్‌కు వెళ్తుండగా ఫోన్‌లో జరిగిన ఇంటర్వ్యూలో ట్రంప్ దీనిపై స్పందించాడు. “ఆమె సరిగా పని చేయకపోతే చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది, బహుశా మదురో కంటే ఎక్కువే” అని అన్నాడు. వెనెజువెలాలో కూడా తమకు అనుకూలంగా పరిపాలన జరగాలన్నది ట్రంప్ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. మదురోను బలవంతంగా తీసుకెళ్లిన నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకున్నాడు. అక్కడ పునర్నిర్మాణం, రెజీమ్ మార్పు.. దాన్ని ఏమని పిలిచినా ఇప్పుడున్న దానికంటే మంచిదేనన్నాడు. ఇతర దేశాలపై కూడా అమెరికా జోక్యం చేసుకోవచ్చని ట్రంప్ సూచించాడు. “గ్రీన్‌ల్యాండ్ మాకు ఖచ్చితంగా కావాలి” అని డెన్మార్క్‌కు చెందిన ద్వీపం గురించి వ్యాఖ్యానించాడు. ఈ ఘటనలు వెనిజులాలో రాజకీయ అనిశ్చితి(Political Crisis)ని పెంచాయి. మదురోను పట్టుకెళ్లిన తర్వాత డెల్సీ రోడ్రిగెజ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. కానీ ఆమె అమెరికాతో సహకరించే సంకేతాలు ఇవ్వలేదు.


