కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్ వైఖరిని తప్పుబట్టారు. ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను అనుమతించే విషయంలో ఇరాన్ ఏమాత్రం గౌరవప్రదంగా వ్యవహరించడం లేదని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఒక పోస్ట్ చేశారు.
హార్ముజ్ జలసంధి నుంచి చమురు సరఫరాను అడ్డుకోవడం, నియంత్రించడం తమ మధ్య జరిగిన ఒప్పందానికి విరుద్ధమని ట్రంప్ తెలిపారు. “హార్ముజ్ జలసంధి ద్వారా చమురు వెళ్లేందుకు అనుమతించే విషయంలో ఇరాన్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది, ఇది ఏమాత్రం గౌరవప్రదం కాదు. మన మధ్య ఉన్న ఒప్పందం ఇది కాదు!” అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ఈ కీలక జలసంధిని తిరిగి తెరవాల్సి ఉంది. అయితే, నౌకల నుంచి ఇరాన్ టోల్ ఫీజులు వసూలు చేయాలని చూస్తోందన్న వార్తల నేపథ్యంలో ట్రంప్ (Donald Trump) ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇరాన్ సహకారం ఉన్నా లేకపోయినా చమురు రవాణా త్వరలోనే పుంజుకుంటుందని, ఇరాన్ తన పద్ధతి మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ పరిణామాలతో అంతర్జాతీయంగా చమురు ధరలపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

