కలం, వెబ్ డెస్క్: రాజస్థాన్‌లోని (Rajasthan) ఝున్జును జిల్లాలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఎడమ కాలికి చేయాల్సిన ఆపరేషన్ కుడి కాలికి చేయడంతో మహిళ ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల కిందట ఓ మహిళ ఎడమ కాలు నొప్పితో ఝున్జును జిల్లా ఆసుపత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యుడు ఆమెకు ఆపరేషన్ అవసరమని గుర్తించి.. ఓటీకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఏ కాలుకు సమస్య ఉందో సరిచూసుకోకుండానే.. వైద్యుడు కుడి కాలికు ఆపరేషన్ చేశారు. అనస్థీషియా ప్రభావం తగ్గిన తర్వాత బాధితురాలు తన కుడి కాలుకు బ్యాండేజీ ఉండటం చూసి ఆశ్చర్యపోయింది.
వైద్యారోగ్య శాఖ ఆగ్రహం…
కోలుకున్న అనంతరం.. సమస్య ఎడమ కాలికి ఉంటే, కుడి కాలికి ఎందుకు ఆపరేషన్ చేశారని ఆమె బంధువులు డాక్టర్‌ని నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. న్యాయం చేయాలంటూ.. హాస్పిటల్ ముందు నిరసన చేపట్టారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ వెంటనే స్పందించి.. ప్రాథమిక విచారణ అనంతరం బాధ్యుడైన డాక్టర్‌ను విధుల నుంచి తొలగించింది. విచారణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.

