కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) రాజకీయాలలో డీఎంకే అధినేత స్టాలిన్ (DMK Chief Stalin) కు ‘సన్’ స్ట్రోక్ తగిలింది. కొడుకును రాజకీయాలలోకి తీసుకురావడం, పార్టీ కీలక బాధ్యతలు అప్పగించడం, ప్రభుత్వంలో ద్వితీయ స్థాయి ప్రభావాన్ని కొనసాగించడం వంటి అంశాలు ప్రజలలో వ్యతిరేకతను పెంచాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. డీఎంకే (DMK) పాలనలో కొన్ని సంక్షేమ పథకాలు అమలైనప్పటికీ, అదే స్థాయిలో అవినీతి ఆరోపణలు కూడా వినిపించాయని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా ప్రజలలో ప్రతికూల ప్రభావం చూపినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. తండ్రితో పోలిస్తే కొడుకు అహంకారంతో ఉన్నారంటూ పార్టీ కేడర్‌తో పాటు ప్రజలు కూడా భావించారు. డీఎంకేపై వ్యతిరేకత పెరగడంతో, సంప్రదాయంగా అన్నాడీఎంకేకు వెళ్లే ఓటు బ్యాంక్ ఈసారి కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాల వైపు మళ్లింది. ముఖ్యంగా నటుడు విజయ్ రాజకీయ ప్రభావం కూడా ఈసారి గణనీయంగా కనిపించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
బై పోలార్ నుంచి ట్రయాంగులర్ ఫైట్
తమిళనాడులో ఈసారి ఎన్నికలు బైపోలార్ నుంచి ట్రయాంగులర్ ఫైట్‌గా మారాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య సాగిన సంప్రదాయ పోరాటానికి ఈసారి కొత్త రాజకీయ శక్తులు చేరడంతో సమీకరణాలు మారిపోయాయని చెబుతున్నారు. అర్బన్ ఓటర్ల మద్దతు కూడా ఈసారి మారినట్లు, సంప్రదాయ రాజకీయాలపై అసంతృప్తి వ్యక్తమైందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. డీఎంకే ప్రభుత్వంలో అవినీతి, ఫ్యామిలీ పాలిటిక్స్ పట్ల ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు. అన్నాడీఎంకే పార్టీలో ఇప్పటికీ ఎంజీఆర్, జయలలిత లెగసీ కొనసాగుతుంది. అందుకే ఆ పార్టీకి ఆదరణ కొనసాగుతూ వస్తుంది . కానీ డీఎంకే బలంగా ఉన్న ప్రాంతాల్లో విజయ్ (Vijay) గెలిచారు. ఈ ట్రయాంగులర్ ఫైట్‌లో అన్నాడీఎంకే తన సంప్రదాయ ఓటు బ్యాంక్‌ను నిలబెట్టుకోగా, డీఎంకేకు మాత్రం గణనీయ నష్టం జరిగినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

