epaper
Tuesday, January 20, 2026
spot_img
epaper

మారుతి నెక్ట్స్ ఏంటి..?

కలం, సినిమా: ఈ రోజుల్లో అనే చిన్న సినిమాతో.. పెద్ద విజయం సాధించి ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మారుతి (Director Maruthi). యూత్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజాసాబ్ మూవీని తెరకెక్కించడం విశేషం. అయితే.. ఇది మారుతికి బంపర్ ఆఫర్ లాంటిది. ఈ బంపర్ ఆఫర్ ను మారుతి సద్వినియోగం చేసుకోలేదు. దీంతో మారుతి నెక్ట్స్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. మరి.. మారుతి నెక్ట్స్ ప్లాన్ ఏంటి..?

ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమకథా చిత్రమ్.. ఇలా విభిన్న కథా చిత్రాలతో.. వరుసగా విజయాలు సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఇంకా చెప్పాలంటే.. చిన్న సినిమాలతో.. యూత్ ఫుల్ మూవీస్ తో సక్సెస్ సాధించి ఓ ట్రెండ్ క్రియేట్ చేశాడు. అయితే.. మారుతి అంటే బూతు చిత్రాల దర్శకుడు అనే ముద్రను చెరిపేసిన సినిమా భలే భలే మగాడివోయ్. ఈ సినిమాని ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించడంతో.. మంచి పేరు వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిసింది.

బాబు బంగారం, మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు, ప్రతిరోజు పండగే, పక్కా కమర్షియల్.. ఇలా కమర్షియల్ మూవీస్ అందించిన మారుతి.. రాజాసాబ్ మూవీతో ప్రభాస్ ను కొత్తగా చూపించాలని ట్రై చేశాడు. హర్రర్ జోనర్ లో ప్రభాస్ (Prabhas)ను కొత్తగా చూపించాలి అనుకోవడం బాగుంది కానీ.. సరైన కథ లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర రాజాసాబ్ అంచనాలను అందుకోలేకపోయాడు. ఫ్లాపుల్లో ఉన్న మారుతిని నమ్మి ఇంత పెద్ద అవకాశం ఇస్తే.. అతను దాన్ని వృథా చేశాడంటూ డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ తనపై ఫైర్ అయ్యారు. అయితే.. సంక్రాంతి సీజన్ అడ్వాంటేజీతో రాజాసాబ్ ఓ మోస్తరుగా వసూళ్లు రాబట్టింది.

మారుతి నెక్ట్స్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. రాజాసాబ్ ఎఫెక్ట్ తో మారుతి మళ్లీ ఓ పెద్ద అవకాశం అందుకోగలడా అన్నది మాత్రం సందేహమే. ప్రస్తుతం పెద్ద హీరోలందరూ బిజీగా ఉన్నారు. పైగా రాజాసాబ్ సినిమా చూశాక మారుతిని నమ్ముతారా అన్నది అనుమానం. మారుతి కూడా మళ్లీ పెద్ద సినిమానే చేయాలనే నియమం ఏమీ పెట్టుకోలేదని తెలుస్తోంది. రాజాసాబ్ రిజల్ట్ చూశాక మారుతికి పెద్ద హీరో, బడ్జెట్ దొరకడం కష్టమని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో మళ్లీ తన బలానికి తగ్గట్లు మిడ్ రేంజిలో ఒక కామెడీ ఎంటర్టైనర్ తీయాలని అతను ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ లైన్ కూడా రెడీ అయ్యిందట. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడని టాక్. మరి.. ఏ హీరో మారుతికి డేట్స్ ఇస్తాడో..? ఎప్పుడు ప్రకటిస్తారో.. చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>