కలం వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది క్రితం అదృశ్యమైన బాలిక ఆచూకీ లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో మహిళా భద్రతకు (Women Safety) పెద్ద పీట వేస్తామన్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గతేడాది ఫిబ్రవరిలో తన కూతురు(15) కనిపించడం లేదంటూ గుంటూరు (Guntur Missing Case) జిల్లా ఆర్.అగ్రహారానికి చెందిన ఏసోబు అనే దివ్యాంగుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తర్వాత పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తెలుసుకున్నా తన కూతురి గురించి ఎలాంటి ఆచూకీ లభించలేదు.
అనంతరం నాలుగు నెలల తర్వాత ఒక కొత్త ఫోన్ నంబర్ నుంచి ఏసోబుకు తన కూతురు ఫోన్ చేసింది. సికింద్రాబాద్‌లో ఉన్నానని చెప్తుండగానే ఫోన్ కట్ అయ్యింది. ఈ విషయాన్ని ఏసోబు అప్పటికప్పుడే పోలీసులకు తెలియజేశాడు. సదరు ఫోన్ నెంబర్ ఇచ్చి కూతురు గురించి తెలుసుకోవాలని కోరాడు. అయినా పోలీసులు స్పందించలేదు. ఆ తర్వాత మరికొన్ని రోజులకు అదే నెంబర్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఏసోబుకు ఫోన్ చేసి తన కూతురు చనిపోయిందని చెప్పారు. అప్పుడు కూడా ఏసోబు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఏసోబు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. పోలీస్ స్టేషన్ ముందు తన గోడు వెళ్లబోసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. “నా బిడ్డ ఏడాదిగా కనిపించడం లేదు.. ఏమైందో చెప్పండయ్యా.. అసలు నా కూతురు బతికే ఉందా? చనిపోయిందా? ఆ విషయమైనా చెప్పండయ్యా” అంటూ విలపిస్తున్నాడు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో బాలికలు, మహిళల అదృశ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో సుమారు 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని, కేంద్రంలోని నిఘా వర్గాలు తనకు ఈ విషయాన్ని చెప్పాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమ్మాయిల భద్రతకు పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025 ఆగస్ట్‌లో ఆపరేషన్ ట్రేస్ ద్వారా ఒక్క నెలలోనే 670 మంది మిస్సింగ్ బాలికల ఆచూకీ (Guntur Missing Case) కనిపెట్టి వారి కుటుంబాలకు అప్పగించారు. అయితే ఈ మిస్సింగ్ కేసులన్నీ వైసీపీ హయాంలోనే జరిగాయన్న దానికి ఎలాంటి ఆధారాలు లేవు. అంతకుముందు జరిగినవి కూడా ఉన్నాయి.
ఈ అంశంపై పవన్ కల్యాణ్ కూడా ఎలాంటి ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు వెల్లడించలేదు. దీంతో పవన్ గతంలో చేసిన ఆరోపణలు, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ మద్దతుదారులు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అదృశ్యమైన 30 వేల మంది మహిళల్లో ఎంతమందిని మీ ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు. నాడు ప్రతి చోటా ఆడపిల్ల భద్రత గురించి మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీస్తున్నారు. ఒక దివ్యాంగుడు నిస్సహాయ స్థితిలో తన కూతురి ఆచూకీ కోసం తిరుగుతుంటే న్యాయం చేయలేని పోలీసులు, ప్రభుత్వం ఎందుకు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ’వివేకా‘ కేసుపై ఇంకా దర్యాప్తు అవసరమా?: సుప్రీంకోర్టు ప్రశ్న
Follow Us On: X(Twitter)


