కలం, ఖమ్మం బ్యూరో: ప్రముఖ సినీ దర్శకుడు మారుతి (Maruthi), ప్రముఖ హాస్యనటుడు, హీరో సప్తగిరి (Saptagiri) భద్రాచలం (Bhadrachalam) లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. శుక్రవారం పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో వారు పాల్గొన్నారు. పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి శాస్త్రోక్తంగా పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ మారుతి దంపతులు పాల్గొని, స్వామివారికి భక్తిశ్రద్ధలతో పండ్లు, విశేషమైన పుష్పాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయంలో కనులపండువగా జరిగిన స్వామివారి నిత్య కల్యాణ వేడుకను వారు సాధారణ భక్తులతో కలిసి కూర్చుని ఎంతో భక్తిభావంతో వీక్షించారు. దర్శనానంతరం డైరెక్టర్ మారుతి, నటుడు సప్తగిరి మీడియాతో మాట్లాడుతూ.. తమ సంతోషాన్ని పంచుకున్నారు. పుష్యమి నక్షత్రం వంటి పవిత్రమైన రోజున భద్రాద్రి రామయ్యను దర్శించుకోవడం, పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనడం తమ పూర్వజన్మ సుకృతమని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారు భక్తిపారవశ్యంతో “జై శ్రీరామ్.. జైజై శ్రీరామ్..” అంటూ భక్తులతో కలిసి చేసిన నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. స్వామివారిని దర్శించుకున్న సినీ ప్రముఖులకు ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనాలతో పాటు స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. భక్తులు వారితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులు భద్రాద్రి రామయ్యను దర్శించుకోవడంతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.

