కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను బాసర జోన్-2 డీఐజీ కె. నారాయణ్ నాయక్ (DIG Narayan Naik) ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య డీఐజీకి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు పురోగతి, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందితో మాట్లాడి వారి బాధ్యతలు, విధులు, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డీఐజీ కె. నారాయణ్ నాయక్ (DIG Narayan Naik) మాట్లాడుతూ.. ప్రతి పోలీస్ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్ట, గౌరవం పెరిగేలా అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నేరాలను త్వరితగతిన ఛేదించాలని అన్నారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, సమన్లు, వారెంట్ల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. కేసుల దర్యాప్తును నిర్ణీత సమయంలో పూర్తి చేసి న్యాయస్థానాల్లో త్వరితగతిన చార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. ప్రతి పోలీస్ సిబ్బందికి చట్టాలు, నూతన నేర న్యాయ చట్టాలు, పోలీస్ విధివిధానాలు, సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన ఉండాలని తెలిపారు.
ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగేలా బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మల్లేష్, ఎస్ఐ బాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : బీఎస్-6 వాహనదారులకు భారీ శుభవార్త
Follow Us On : WhatsApp

