కలం, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఆయన డీయాక్టివేట్ చేశారు. 46 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఈ ఖాతా ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. హార్దిక్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే, IPL 2026లో ముంబై ఇండియన్స్ నిరాశాజనక ప్రదర్శన తర్వాత ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కెప్టెన్‌గా జట్టు వైఫల్యంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.
ఇక ఆయన వ్యక్తిగత జీవితంపైనా కొందరు అభిమానులు బహిరంగంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. 24 ఏళ్ల ఫియాన్సీ మహికా శర్మతో ఆయన నిశ్చితార్థం తర్వాత కూడా సోషల్ మీడియాలో చర్చలు సాగాయి. ఇటీవల హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ లిస్ట్ నుంచి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో పాటు కొంతమంది ఆటగాళ్లను తొలగించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో హార్దిక్, ముంబై ఇండియన్స్ మధ్య అంతా సవ్యంగా లేదనే ఊహాగానాలు పెరిగాయి.
వచ్చే IPL సీజన్‌కు ముందు ఆయన జట్టును వీడతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ అంశంపై హార్దిక్ గానీ, ముంబై ఇండియన్స్ గానీ అధికారికంగా స్పందించలేదు. మైదానం బయట కూడా హార్దిక్ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. లగ్జరీ వెకేషన్లు, ఖరీదైన కార్లు, ఖరీదైన గడియారాల కలెక్షన్‌తో పాటు తన కుమారుడు అగస్త్యతో గడిపే క్షణాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.
అయితే ఇన్‌స్టాగ్రామ్‌కు మాత్రమే ఆయన దూరమైనట్లు తెలుస్తోంది. ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్‌లో ఆయన యాక్టివ్‌గానే ఉన్నారు. ఫేస్‌బుక్, థ్రెడ్స్ ఖాతాలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో హార్దిక్ పూర్తిగా సోషల్ మీడియాకు దూరం కాలేదని, కేవలం ఇన్‌స్టాగ్రామ్ నుంచే తాత్కాలిక విరామం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

