కలం, నిజామాబాద్ బ్యూరో: ఇందూరులో నిర్వహించే వినాయకుడి శోభాయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana) సూచించారు. బుధవారం నగరంలోని దుబ్బ చౌరస్తా నుంచి లలితా మహల్, గాంధీ గంజ్, నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, పవన్ టాకీస్, గాజుల్ పేట్, పెద్ద బజార్, గోల్ హనుమాన్ మీదుగా వినాయకుల బావి వరకు శోభాయాత్ర రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. ఇందూరులో వందేళ్లుగా అనంత చతుర్దశి (ఈ నెల 25న) రోజున ప్రత్యేక రథంలో వినాయకుడి శోభాయాత్ర కొనసాగుతూ వస్తోందన్నారు. విద్యుత్, కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్, పోలీసు శాఖల సమన్వయంతో పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు.
భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి..
ప్రధానంగా విద్యుత్ దీపాల ఏర్పాటు, రోడ్లపై గుంతల పూడ్చివేత, అవసరమైన చోట బీటీ రోడ్ల నిర్మాణం, వినాయకుల బావి వద్ద సౌకర్యాలను పరిశీలించినట్లు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. మండప నిర్వాహకులు శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించాలన్నారు. మేయర్ ఉమారాణి, కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి, బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, పసునూరి రాము, జగదీష్ కులకర్ణి, బంటు ప్రీతి ప్రవీణ్, ప్రసూన శ్రీనివాస్, జ్యోతి మురళి, నాయకులు పంచరెడ్డి శ్యామ్, శ్రీనివాస్, మరావర్ కృష్ణ, మహిళా మోర్చా అధ్యక్షురాలు వనిత పాల్గొన్నారు.

