కలం, వరంగల్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinaya Bhaskar)తో పాటు మరో 15 మంది బీఆర్‌ఎస్ (BRS) నాయకులపై మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద జరిగిన ఘటనకు సంబంధించి ఎస్‌ఐ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
బీఎన్ఎన్ఎస్ సెక్షన్‌లోని 132, 121, 189, 190, 126, 351 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎంజీఎంలో నెలకొన్న పరిస్థితులను పరిశీలించేందుకు వినయ్ భాస్కర్ మంగళవారం ఆస్పత్రికి వెళ్లారు. కాగా, ఆయనను పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సమయంలో ఆయనకు గాయాలు కూడా అయ్యాయి. మరోవైపు పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పోలీసులే వినయ్ భాస్కర్‌పై దాడి చేశారని ఆరోపిస్తున్నారు.

