కలం, నాగర్‌కర్నూల్: ఎల్‌నినో పేరుతో కృష్ణా జలాలను (Krishna Water) తెలంగాణకు వినియోగించకుండా రాష్ట్రాన్ని ఎండబెడుతున్నారని, ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం ప్రాంతానికి నీటిని తరలిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గురుదక్షిణ చెల్లిస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. నాగర్‌కర్నూల్(Nagarkurnool) జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ప్రస్తుతం రోజుకు ఒక్క మోటార్ మాత్రమే నడిపిస్తూ 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. మూడు మోటార్లను నిరంతరాయంగా నడిపితే 2,400 క్యూసెక్కుల నీటిని పాలమూరుకు అందించే అవకాశం ఉందన్నారు.
శ్రీశైలంలో నీటి నిల్వలు ఉన్నప్పటికీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని మోటార్లను పూర్తిస్థాయిలో ఎందుకు నడపడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీడీపీ, కాంగ్రెస్ పాలనలో మూడు దశాబ్దాల పాటు పాలమూరుకు తగిన ప్రాధాన్యం లభించలేదని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో కల్వకుర్తి పంపుహౌస్‌లను పూర్తి చేసి సాగునీరు అందించామని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు పథకాల ద్వారా సుమారు 26 వేల ఎకరాలు మాత్రమే సాగులో ఉండేవని, తమ హయాంలో రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి 6.50 లక్షల ఎకరాలకు నీరు అందించామని పేర్కొన్నారు.
కృష్ణా జలాల తరలింపుపై ప్రశ్నలు
కృష్ణానది జలాలు తెలంగాణ హక్కు అని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణలో పంట పొలాలకు నీరు అందాల్సి ఉండగా కృష్ణా జలాలు పెన్నా బేసిన్, కుప్పం వైపు తరలిపోతున్నాయని ఆరోపించారు. శ్రీశైలంలో నీటి నిల్వలు ఉన్నప్పటికీ కల్వకుర్తి మోటార్లను పరిమిత సమయానికే నడుపుతున్నారని విమర్శించారు. తమ హయాంలో కల్వకుర్తి మోటార్లను నెలల తరబడి నిరంతరాయంగా నడిపించామని చెప్పారు. గోదావరి జలాల వినియోగంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలని హరీశ్‌రావు అన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకంలో అందుబాటులో ఉన్న మోటార్లను పూర్తిస్థాయిలో వినియోగించడం లేదని ఆరోపించారు. 24 గంటలు మోటార్లు నడిపే అవకాశం ఉన్నప్పటికీ పరిమిత సమయానికే నడుపుతున్నారని అన్నారు.
పాలమూరు-రంగారెడ్డిపై హరీశ్‌రావు వ్యాఖ్యలు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిందని హరీశ్‌రావు తెలిపారు. 27 వేల ఎకరాల భూసేకరణ చేపట్టి నార్లాపూర్, ఏదుల, కరివెన, వట్టెం రిజర్వాయర్లను పూర్తి చేశామని చెప్పారు. 50 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లను సిద్ధం చేశామని పేర్కొన్నారు. నార్లాపూర్‌లో 145 మెగావాట్ల బాహుబలి మోటార్‌ను 2023 సెప్టెంబర్ 16న కేసీఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు. ప్యాకేజీ-8లో సున్నపుతాండ–తెల్లరాళ్లపల్లి మధ్య కాలువ పనుల్లో కొంత భాగం మాత్రమే మిగిలి ఉందని, మిగిలిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయడంలో జాప్యం చేస్తోందని ఆరోపించారు. పనులు పూర్తి చేస్తే శ్రీశైలం నుంచి మరింత నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంటుందని అన్నారు.
నీటి నిర్వహణపై విమర్శలు
కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణకు లభించే వాటాను ప్రభుత్వం పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి, నాగార్జునసాగర్‌కు నీటి విడుదల పేరుతో కృష్ణా జలాలు దిగువకు వెళ్తున్నాయని ఆయన ఆరోపించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువలో క్రాప్ హాలిడే ప్రకటించిన అంశంపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. మోటార్లను తరచూ ఆన్, ఆఫ్ చేయడం వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారని హరీశ్‌రావు అన్నారు.
ఒక మోటార్ కాలిపోయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నీటి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోకపోతే రైతులు, ప్రజలు నష్టపోయే అవకాశం ఉందన్నారు. కృష్ణా జలాల వినియోగంపై ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం తెలంగాణకు ఉన్న వాటాను సమర్థంగా వినియోగించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న నీటిని పూర్తిస్థాయిలో వినియోగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.

