కలం, యాదగిరిగుట్ట: వేసవి సెలవులు కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి (Yadadri Temple) భక్తులు అధికంగా వివిధ రాష్ట్రాల నలుమూలల నుండి అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో గంటల తరబడి భక్తులు కొండ పైన, కొండ కింద బస్టాండ్లలో నిరీక్షించాల్సి వస్తోంది. ఆదివారం భక్తులు ఎక్కువగా రావడంతో చాలామంది కొండ కింద వాహనాలు పార్కింగ్ చేసి ఆర్టీసీ బస్సుల్లో కొండపైకి వెళ్లాల్సి వచ్చింది. సరిపడా బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాదగిరిగుట్టపైకి, కొండ కిందకు ఆదివారం పది బస్సులను మాత్రమే నడుపుతున్నారు. ఒక్కో బస్సులో 60 మంది ప్రయాణికులు ఎక్కాల్సి ఉండగా.. వందకుపైగా మంది వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది భక్తులు సీట్ల కోసం పోటీపడడంతో పాటు ఫుట్ బోర్డుపై నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. భక్తుల దృష్ట్యా సరిపడా బస్సులు లేకపోవడంతో అధికారుల తీరుపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది భక్తులు మెట్లమార్గంలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
చిన్న పిల్లలతో తల్లిదండ్రులు అవస్థలు..
ధర్మ దర్శనం, వీఐపీ దర్శనం క్యూలైన్లలో చిన్న పిల్లలతో వచ్చిన కుటుంబాలు తీవ్ర అవస్థలు ఎదురుకొంటున్న పరస్థితి కనిపిస్తుంది. క్యూలైన్లలో ఉక్కపోతతో పాటు క్యూకాంప్లెక్స్ నుంచి గోల్డ్ క్యూలైన్లోకి వచ్చే వరకు నీళ్లు లేకపోవడంతో చిన్నారులుతో తల్లిదండ్రులు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఆలయాధికారులు రూ.150 క్యూలైన్, గోల్డ్ క్యూలైన్లోని భక్తులకు మాత్రమే తాగునీటిని సరఫరా చేసారని భక్తులు తెలిపారు. పలువురు భక్తులు తమ పిల్లలతో నేరుగా తూర్పు రాజగోపురం ముందు ఉన్న మెయిన్ గేట్ ద్వారా ఆలయంలోకి (Yadadri Temple) వెళ్లేందుకు గాను ఎస్పీఎఫ్, హోంగార్డు సిబ్బందిని వేడుకున్నా తాళాలు తీయలేదని వాపోతున్నారు. ఆలయ అధికారులు వచ్చి జోక్యం చేసుకోవడంతో తాళాలు తీసి పంపించారని చిన్నారులతో వచ్చిన పలువురు భక్తులు తెలిపారు. తూర్పు రాజగోపురం ముందు నుంచి, వైకుంఠద్వారం వద్ద స్వామివారిని తమ మొక్కులను మొక్కి దర్శనం చేసుకోకుండానే వెనక్కి వెళ్లిన భక్తుల సంఖ్య అధికంగా కనిపిస్తుంది.
ప్రసాద విక్రయశాలలోనూ అవస్థలే..
ప్రసాదం కౌంటర్ అఖండ దీపం పక్కన ఉండటంతో టిక్కెట్ కొనుగోలు చేసి తిరిగి ప్రసాద విక్రయశాలలో గంటల తరబడి ప్రసాదం కోసం వేచి చూడాల్సి వచ్చిందని భక్తులు తెలిపారు. ప్రసాద విక్రయశాల పక్కకే కౌంటర్ పెట్టి ఉంటే బాగుండేదని పలువురు భక్తులు పేర్కొన్నారు. గంటల తరబడి దర్శనం క్యూలైన్లలో నిల్చోని, ప్రసాదం కోసం కూడా వేచి ఉన్నామని మహిళా భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. యాదగిరీశుడిని దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులతో వచ్చామని కొండ కింద నుంచి ఆర్టీసీ బస్సులో కొండపైకి వచ్చామని భక్తులు తెలిపారు. బస్సులు సరిగ్గా లేవని అన్నారు. సుమారు నాలుగు గంటలు ధర్మ దర్శనం క్యూలైన్లో నిల్చోని స్వామిని దర్శించుకున్నామని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కొండ పైన బస్టాండ్ వద్దకు వచ్చేసరికి బస్సులు లేవని తెలిపారు. ఒకేసారి 5-6 బస్సులు వచ్చినప్పటికి భక్తులంతా గుంపులుగా వెళ్లి పోటీపడుతూ ఎక్కారని చెప్పారు. సుమారు గంటల పాటు మరో బస్సు కోసం వేచి చూడాల్సి వస్తుందని.. భక్తులకు అనుగుణంగా బస్సులను నడిపించాలని కోరారు.
ప్రసాదం కోసం వేచి చూడాల్సిందే: కమ్మగిరి నర్సింహా, అనురాధ
మేం కుటుంబ సభ్యులతో కలిసి రూ.150 టిక్కెట్ కొనుగోలు చేసి స్వామిని దర్శించుకున్నాం. అనంతరం లడ్డూ, పులిహోర ప్రసాదం కొనుగోలు కోసం వెళ్తే భారీ లైన్ ఉంది. వృద్ధులు, దివ్యాంగులకు ప్రసాదం సెక్షన్ వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డాము. ఇకనైనా అధికారులు కళ్ళు తెరిచి ప్రసాద విక్రయశాల వద్ద దివ్యాంగులు వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది.
Read Also: బరువు తగ్గాలా? ఇలా స్టెప్ బై స్టెప్ ట్రై చేయండి!
Follow Us On : WhatsApp

