కలం, మహబూబ్ నగర్ బ్యూరో: అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యం విషయంలో నిబంధనల ప్రకారం రైతులకు నష్టం కలగకుండా చూడాలని సంబంధిత అధికారులకు వనపర్తి (Wanaparthy) జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ ఆదేశించారు. శనివారం కురిసిన అకాల వర్షం కారణంగా వనపర్తి మండలంలోని పలు వరి కొనుగోలు కేంద్రాలు ప్రభావితమైన నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఆదివారం వనపర్తి మండల పరిధిలోని కడుకుంట్ల, పెద్దగూడెం గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించి, క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. కొనుగోలు కేంద్రాల్లో వర్షపు నీరు చేరి తడిసిపోయిన ధాన్యం కుప్పలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షం కారణంగా రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం మరింత తడవకుండా తగినన్ని టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలన్నారు. వర్ష సూచన ఉన్నందున కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యం విషయంలో నిబంధనల ప్రకారం రైతులకు నష్టం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అకాల వర్షాల వల్ల రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటుందని, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ అధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులు, ఐకేపీ, సొసైటీ నిర్వాహకులు పాల్గొన్నారు.
Read Also: భారీ శుభవార్త.. జూన్ 2 నుంచి ‘ఇందిరమ్మ జీవిత బీమా’
Follow Us On: Instagram

