Mobile Popup Ad
Mobile Popup Ad

సింగరేణిపై ఎవరైనా డేగ కన్ను వేస్తే ఊరుకోం: భట్టి విక్రమార్క

కలం, వెబ్ డెస్క్ : సింగరేణిపై ఎవరైనా డేగ కన్ను వేస్తే ప్రజా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, తెలంగాణ ప్రజల ఆస్తిని కాపాడటంలో రాజీ ఉండదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం మంచిర్యాల జిల్లాలో రెండో రోజు తన పర్యటనను కొనసాగిస్తూ సింగరేణి సంస్థలో అతిపెద్ద ఏరియాగా పేరొందిన శ్రీరాంపూర్ ఏరియాను ఆదివారం సందర్శించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో కలిసి సింగరేణిలో జరుగుతున్న కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసి సింగరేణి సంస్థను కేంద్రం పరిధిలోకి తీసుకోవాలని కుట్ర చేస్తున్నాయని భట్టి విక్రమార్క ఆరోపించారు. సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి అని, కార్మికుల చెమటతో ఎదిగిన ఈ సంస్థ ప్రతిష్టను రాజకీయ స్వార్థాల కోసం దెబ్బతీయాలని చూసే ప్రయత్నాలను ప్రజా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని హెచ్చరించారు.

ఈ క్రమంలోనే కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, వారి ఆరోగ్యం, భద్రత, పిల్లల విద్య, భవిష్యత్తు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు, క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సులు, అంతర్జాతీయ ప్రమాణాల విద్యా అవకాశాలు, ప్రమాద బీమా వంటి కార్యక్రమాల ద్వారా కార్మిక కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే పోటీ మార్కెట్ పరిస్థితుల్లో సంస్థ మరింత బలోపేతం కావాలంటే నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలని సింగరేణి అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ ఉత్పత్తి కార్యకలాపాలను కొనసాగించాలని స్పష్టం చేశారు.ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడం ద్వారా సింగరేణికి మరో వందేళ్లపాటు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. సంస్థ లాభదాయకత, పోటీతత్వ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు సమష్టిగా కృషి చేయాలని అధికారులకు సూచించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>