Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ మహిళా సంఘాలు దేశానికే ఆదర్శం: భట్టి

కలం, ఖమ్మం బ్యూరో:  మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)  తెలిపారు. బుధవారం ఎర్రుపాలెం మండలం వెంకటాపురంలో గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), పంచాయతీరాజ్‌శాఖ స్పెషల్ సీఎస్ దాన కిషోర్, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, సెర్ఫ్ సీఈఓ దివ్యా దేవరాజన్, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌ లతో కలిసి పర్యటించిన డిప్యూటీ సీఎం వెంకటాపురంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో 2 కోట్ల 84 లక్షలతో ఏర్పాటు చేసిన 1 మెగా వాట్ సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించి, కోటి 30 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్లు

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. గతంలో వైఎస్సార్ హయాంలో ప్రవేశపెట్టిన పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాల పథకాలను తిరిగి ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. మహిళాసంఘాలకు రూ.5 లక్షల వరకు ఉన్న వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, ఇందిరమ్మ క్యాంటీన్లు, ఆర్టీసీకి అద్దె బస్సులు, టర్మరిక్ యూనిట్లు వంటి పెద్ద వ్యాపారాల్లో మహిళా సంఘా లను భాగస్వామ్యం చేస్తున్నామని పేర్కొన్నారు.

రెండున్నరేండ్లలో 66 వేల కోట్ల రుణాలు

ఐదేళ్లలో మహిళా సంఘాలకు లక్ష కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తామని ప్రకటించగా, తొలి రెండున్నరేళ్లలోనే రూ.66 వేల కోట్ల రుణాలు పంపిణీ చేశామని తెలిపారు. మహిళా సంఘాలకు తక్కువ ధరకు భూములు కేటాయించి, సాంకేతిక సహకారం అందిస్తూ సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేపడుతున్నామని, ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వెల్లడించారు.

కొతలేకుండా నిరంతరాయంగా విద్యుత్

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగినా ఎలాంటి కోతలు లేకుండా నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. గతంలో 15 వేల మెగావాట్లుగా ఉన్న పీక్ డిమాండ్ ప్రస్తుతం 18,480 మెగావాట్లకు చేరిందన్నారు. బోనకల్ మండలంలోని అన్ని గ్రామాలకు పైలట్ ప్రాజెక్టు క్రింద సోలార్ విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

మహిళ అభివృద్ధే తెలంగాణ ప్రగతికి పునాది

గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కావడం స్ఫూర్తిదాయకమన్నారు. మహిళల అభివృద్ధే తెలంగాణ ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. మహిళలకు నాణ్యమైన ఇందిరమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్ దివాకర్,ఇతర అధికారులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>