కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణకు ఆత్మ వంటి 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ భవిష్యత్తును సరికొత్త మలుపు తిప్పేలా ఉప ముఖ్యమంత్రి (Deputy CM) భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సంచలన నిర్ణయాలు వెల్లడించారు. సాంప్రదాయ బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా, గ్లోబల్ రేసులో నిలిచేలా సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి విస్తరింపజేస్తామని స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, చిప్స్ తయారీకి అత్యంత కీలకమైన లిథియం, కోబాల్ట్ వంటి అరుదైన ఖనిజాల (రూర్ ఎర్త్ మినరల్స్) మైనింగ్ రంగానికి సింగరేణి తక్షణమే శ్రీకారం చుట్టాలని ఆదేశించారు.
భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సింగరేణి, జెన్‌కో ఉన్నతాధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన సంస్థ విస్తరణపై దిశా నిర్దేశం చేశారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వం తలుపులు దీనికోసం 24 గంటలూ తెరిచే ఉంటాయని తెలిపారు. సంస్థ వద్ద దశాబ్దాల అనుభవం కలిగిన నిపుణులైన ఇంజనీర్లు, మైనింగ్ కార్మికులు ఉన్నారని, ఈ అపారమైన మానవ వనరులను గ్లోబల్ ప్రాజెక్టుల కోసం ఉపయోగించుకోవాలని సూచించారు.
ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాల్లో జరిగే క్రిటికల్ మినరల్స్ వేలంలో సింగరేణి నేరుగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇకపై సంస్థ బోర్డు సమావేశాలు కేవలం రొటీన్ పరిపాలనా అంశాలకే పరిమితం కాకుండా, రాబోయే 10 ఏళ్ల రోడ్‌మాప్‌పై సుదీర్ఘంగా చర్చించాలని, కార్పొరేట్ సంస్థల మాదిరిగా నిర్దిష్ట టైమ్‌లైన్ క్యాలెండర్ పెట్టుకుని లక్ష్యాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
రాబోయే 15 నుండి 20 ఏళ్లలో ఇంధన రంగం స్వరూప స్వభావాలు పూర్తిగా మారబోతున్నాయని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. సోలార్, పంప్డ్ స్టోరేజ్, విండ్, హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు పెరిగితే క్రమంగా థర్మల్ విద్యుత్, బొగ్గు వినియోగం తగ్గే అవకాశాలు ఉన్నాయని, అందుకే ఇప్పటి నుంచే సింగరేణి ప్రత్యామ్నాయ రంగాలు వెతుక్కోవడం అత్యంత ఆవశ్యకమని అన్నారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల బహిరంగ వేలం విధానాన్ని తేవడంతో ప్రైవేట్ సంస్థల పోటీ తీవ్రమైందని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ కంపెనీలకు పోటీగా నిలబడాలంటే నాణ్యతలో రాజీ పడకూడదని ఆదేశించారు. తవ్వకాల సమయంలో బొగ్గులో మట్టి, రాళ్లు కలవకుండా కఠినంగా పర్యవేక్షించడమే కాకుండా, సమర్థవంతమైన శుద్ధీకరణ, సరైన బ్లెండింగ్ ద్వారా వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును అందించాలని, నిర్వహణా వ్యయాన్ని తగ్గించుకోవాలని సూచించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందుచూపు, సుదీర్ఘ ప్రణాళికలు లేకపోవడం వల్లే వేలంలో పాల్గొని నూతన బొగ్గు బ్లాకులను సింగరేణి సాధించుకోలేకపోయిందని భట్టి విక్రమార్క విమర్శించారు. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు కేటాయింపుల్లో కూడా తీవ్ర నిర్లక్ష్యం వహించారని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒడిశాలోని నైనీ బ్లాక్, తాడిచర్ల-2 ప్రాజెక్టులపై ఉన్న భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించిందని స్పష్టం చేశారు.
సింగరేణి కేవలం ఒక వ్యాపార సంస్థ మాత్రమే కాదని, వేలాది మంది కార్మిక కుటుంబాల జీవితమని పేర్కన్న ఆయన, సంస్థ లాభాల్లో ఉంటేనే కార్మికుల భవిష్యత్తు భద్రంగా ఉంటుందన్నారు. ప్రతి గని స్థాయిలో మేనేజ్‌మెంట్, కార్మిక సంఘాలు కార్మికులతో బహిరంగ చర్చలు ప్రారంభించి, వారి నుంచి వచ్చే సలహాలు, సూచనలతో ఒక సమగ్రమైన యాక్షన్ ప్లాన్ రూపొందించి ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు.

