కలం, నిర్మల్: దేశ ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ (MLA Vedma Bojju) అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు (Khanapur BJP) డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం నర్సాపూర్ (జి), మామడ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్‌పై బీజేపీ నాయకులు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
ఖానాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న ప్రధానమంత్రి గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం తగదని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదు కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నరేందర్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

