కలం, తెలంగాణ బ్యూరో : ధాన్యం కొనుగోళ్ళలో ప్రభుత్వం (Telangana Grain Procurement) సరికొత్త టెక్నాలజీ విప్లవానికి శ్రీకారం చుట్టబోతున్నది. ప్రతి ఏటా ధాన్యం సేకరణ సీజన్‌లో హమాలీల కొరత, గోడౌన్లలో స్థల సమస్య, లోడింగ్-అన్‌లోడింగ్ ప్రక్రియలో జాప్యం.. వీటన్నింటినీ అధిగమించడానికి ఆటొమేషన్ టెక్నాలజీ గురించి ఆలోచిస్తున్నది. త్వరలోనే సివిల్ సప్లైస్ అధికారులు వివిధ దేశాల్లో పర్యటించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయనున్నారు. తక్కువ మాన్‌పవర్‌తో, తొందరగా మిల్లులకు ధాన్యాన్ని తరలించడానికి ఉన్న ప్రత్యామ్నాయాలను అధికారులు స్టడీ చేస్తారు. ఏయే దేశాల్లో ఎలాంటి టెక్నాలజీ వినియోగిస్తున్నదనీ పరిశీలించి తెలంగాణలో దాన్ని అమలు చేయడంలోని అనుకూల, ప్రతికూల అంశాలపై స్పష్టతకు రానున్నారు. వీరు ఇచ్చే నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం ఏ మేరకు ఆటోమేషన్ సాధ్యపడుతుందో అంచనాకు వచ్చి నిర్ణయం తీసుకోనున్నది. ప్రతీ సీజన్‌లో ఎదురయ్యే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనాలన్నది సివిల్ సప్లైస్ డిపార్టుమెంటు ఆలోచన.
ఆటోమేషన్‌తో మారనున్న కొనుగోళ్ళ ముఖచిత్రం
రైతులు, అధికారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కనుగొనేలా సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి ధాన్యం సేకరణ, రవాణా ప్రక్రియలో పూర్తిస్థాయి ఆటోమేషన్, మెకనైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టడం రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం. ప్రస్తుత మాన్యువల్ పద్ధతిలో ఒక లారీ ధాన్యం లోడింగ్ లేదా అన్‌లోడింగ్ కోసం గంటల కొద్దీ సమయం పడుతున్నది. హమాలీలు దొరకని కారణంగా రోజుల తరబడి లారీలు ఐకేపీ సెంటర్లలో లేదా మిల్లుల్లోనే నిలిచిపోతున్నాయి. కొత్త విధానం అమల్లోకి వస్తే దాదాపు చాలా సమయం ఆదా అవుతుందన్నది అధికారుల ప్రాథమిక అంచనా. ఒక లారీ లోడింగ్/అన్‌లోడింగ్ ప్రక్రియను ఆటోమేటిక్ కన్వేయర్ బెల్టులు, హైడ్రాలిక్ లిఫ్టుల ద్వారా 20 నిమిషాల్లోనే పూర్తిచేయవచ్చనేది వారి వాదన. వందలాది మంది హమాలీల అవసరం లేకుండా కొద్దిమంది స్కిల్డ్ పర్సన్స్‌తోనే ముగించడానికి వెసులుబాటు లభిస్తుంది. మిల్లులకు వేగంగా రవాణా చేయడంతోపాటు కొనుగోలు కేంద్రాల దగ్గర అకాల వర్షాలకు ధాన్యం తడిచే పరిస్థితులను నివారించవచ్చన్నది కూడా వారి ఆలోచన.
గోడౌన్లలో స్థలం కొరతకూ నూతన విధానం :
అంచనాలకు మించి ధాన్యం ఉత్పత్తి అవుతున్నందున దాన్ని మిల్లుల్లో, గోడౌన్లలో నిల్వ చేయడం కూడా ప్రభుత్వానికి సమస్యగా మారింది. ఇప్పటికిప్పుడు గోడౌన్లను విస్తరించడానికి, కొత్తవాటిని నిర్మించడానికి ఉన్న సమస్యలకు ప్రత్యామ్నాయంగా వాటిలోని సామర్థ్యాన్ని పెంచడానికి ఉన్న మార్గాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. చాలా దేశాల్లో అమలు చేస్తున్న సైలోస్ అనే వర్టికల్ స్టోరేజ్ విధానాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించే అవకాశమున్నది. ఈ పద్ధతిలో తక్కువ స్థలంలోనే ఎక్కువ ధాన్యాన్ని భద్రపరచవచ్చనేది అధికారుల భావన. కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో హైడ్రాలిక్ లిఫ్టింగ్, కన్వేయర్ బెల్ట్, బల్క్ హ్యాండ్లింగ్, వాక్యూమ్ అండ్ న్యూమాటిక్ కన్వేయర్స్ తదితర విధానాలను వాడుతున్నట్లు ప్రాథమికంగా ఉదహరించారు. మిల్లులకు సమీపంలో కొనుగోలు కేంద్రం ఉన్నట్లయితే గన్నీ బ్యాగుల అవసరమే లేకుండా ‘గ్రెయిన్ కార్ట్స్’ విధానంలో నేరుగా తరలించవచ్చే విధానాన్ని కూడా అధికారులు సూచనప్రాయంగా తెలిపారు.
గోడౌన్లలో ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్
గోడౌన్లలో నిల్వ చేసిన ధాన్యం చెడిపోకుండా, ఫంగస్‌కు గురికాకుండా ఉండేందుకు కూడా ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. వర్షాకాలంలో తేమకు గురికాకుండా, శీతాకాలంలో చలికి బూజు పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండేలా ‘ఆటోమేటిక్ టెంపరేచర్ అండ్ హ్యుమిడిటీ కంట్రోల్ సిస్టమ్’ ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. ఉష్ణోగ్రతలు పెరగడం, తేమ శాతం ఎక్కువ కావడంతో కోట్లాది రూపాయల విలువైన ధాన్యం చెడిపోవడం లేదా పురుగు పడుతుండే సమస్యలకు ఇది నివారణ ఉపాయంగా ఉంటుందనేది అధికారుల అభిప్రాయం. గోడౌన్లలో డిజిటల్ సెన్సార్లను ఏర్పాటు చేసి ఆటోమేటిక్‌గా 24 గంటలూ పనిచేసే విధానంతో ధాన్యం బస్తాల మధ్య ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఈ విధానం. ఉష్ణోగ్రతల్లో వచ్చే తేడాలను కంట్రోల్ రూమ్‌కు, సూపర్‌వైజర్ మొబైల్‌కు అలర్ట్ పంపడంతో పాటు గోడౌన్లలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, కూలర్లు ఆటోమేటిక్‌గా ఆన్ అవుతాయి.

