కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా మనూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ భూమిలో ఆక్రమణలకు గురయ్యాయంటూ అధికారులు వీధి వ్యాపారులకు చెందిన 31 దుకాణాల షెడ్లను తొలగించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, తమ జీవనాధారమైన దుకాణాలను తెల్లవారుజామున కూల్చివేయడంపై వ్యాపారులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి బాధితులకు మద్దతుగా ఘటనా స్థలానికి చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు. నిరుపేద వ్యాపారుల పొట్టకొట్టడం సరికాదని అధికారుల వైఖరిపై మండిపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో పాటు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.

