ఢిల్లీకి ప్రపంచ క్రీడల జాక్‌పాట్.. స్కూల్ చాంపియన్‌షిప్స్ ఖాయం

కలం, స్పోర్ట్స్​ : ఢిల్లీకి మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ దక్కింది. తొలిసారి ఐఎస్ఎఫ్ వరల్డ్ స్కూల్ రెజ్లింగ్ (World School Wrestling), వరల్డ్ స్కూల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌ (Badminton Championships) కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం జాతీయ రాజధానికి లభించింది. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ), ఇంటర్నేషనల్ స్కూల్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎఫ్) మధ్య శుక్రవారం త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. వచ్చే ఏడాది జరిగే ఈ మెగా టోర్నీల్లో 50కుపైగా దేశాల నుంచి వెయ్యి మందికి పైగా విద్యార్థి క్రీడాకారులు పాల్గొననున్నారు.

విద్యార్థులతో పాటు కోచ్‌లు, సాంకేతిక అధికారులు, ప్రతినిధులు కూడా ఢిల్లీకి రానున్నారు. దీంతో అంతర్జాతీయ క్రీడల నిర్వహణలో ఢిల్లీకి మరో గుర్తింపు లభించనుంది. ఈ ఒప్పందం యువ క్రీడాకారులకు గొప్ప అవకాశంగా మారనుందని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్ తెలిపారు. ప్రపంచ స్థాయి వేదికపై పోటీ పడే అవకాశం లభించడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాల క్రీడా వసతులను అనుభవించే అవకాశం కూడా ఈ పోటీల ద్వారా దక్కుతుందని వివరించారు.

ఈ టోర్నీలతో ఢిల్లీ క్రీడా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు నగరం మరింత సిద్ధంగా మారుతుందని తెలిపారు. ఈ ఛాంపియన్‌షిప్‌ల ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించినట్లు వెల్లడించారు. ఐఎస్‌ఎఫ్ వరల్డ్ స్కూల్ ఛాంపియన్‌షిప్‌లకు ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి అని ఆశిష్ సూద్ గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ‘ఖేలో ఇండియా’, ‘ఫిట్ ఇండియా’ కార్యక్రమాలకు ఈ పోటీలు మరింత ఊతమిస్తాయని చెప్పారు.

ముఖ్యమంత్రి రేఖా గుప్తా నాయకత్వంలో ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు. త్వరలో కామన్‌వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లకు కూడా ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుందని మంత్రి తెలిపారు. అనంతరం జరిగే ఐఎస్ఎఫ్ వరల్డ్ స్కూల్ ఛాంపియన్‌షిప్స్‌తో నగరం అంతర్జాతీయ క్రీడా పటంలో మరింత బలమైన ముద్ర వేయనుందని పేర్కొన్నారు. ఈ పోటీలు భారత పాఠశాల క్రీడాకారులకు ప్రపంచ స్థాయి ప్రత్యర్థులతో తలపడే విలువైన అవకాశాన్ని కల్పించనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>